Site icon Prime9

Maha Shivaratri: అలా పాటిస్తే మహా శివరాత్రి ఉపవాసం, జాగరణ ఫలితం

maha sivaratri

maha sivaratri

Maha Shivaratri: పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ‘మహాశివరాత్రి’. ఈ పర్వదినాన, శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రతి ఏటా మాఘమాసం కృష్ణ చతుర్దశి నాడు మహా శివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.

ఈ శివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం, జాగరణ చేస్తుంటారు. అయితే చాలామందికి శివరాత్రి ఉపవాసం ఎందుకు చేయాలని.. ఎలా చేయాలనే సందేహాలు వస్తుంటాయి.

మహా శివుడు ఈ రోజే లింగరూపంలో ఉద్భవించాడని.. పార్వతిని వివాహం చేసుకున్నది కూడా ఇదే రోజు అని పురాణాలు చెబుుతున్నాయి.

అందుకే ఈరోజు శివనామస్మరణంతో ఆ మహాశివుడికి దగ్గరగా ఉంటే ఆయన కటాక్షం ఉంటుందని విశ్వాసం. ఈ రోజు ఉపవాసం ఉండి.. ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివుడిని ఆరాధించడం, అభిషేకించడం చేస్తుంటారు భక్తులు.

వాతావరణ మార్పులకు తగినట్టుగా(Maha Shivaratri)

ఉపవాసం అంటే ఉప+ఆవాసం. ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్య పరంగానూ ఉపవాసం మేలు చేస్తుంది. చలికాలంలో మందగించి ఉండే జీర్ణ వ్యవస్థ.. వేసవి రాకతో ఎక్కువ అవుతుంది.

చలికాలానికి స్వస్తి చెబుతూ వేసవి వచ్చే క్రమంలో శివరాత్రి వస్తుంది. అందుకే ఈ పర్వదినాన ఉపవాసం చేయడంతో శరీరం వాతావరణంతో జరిగే మార్పులకు తగినట్టుగా సిద్ధమవుతుందని చెబుతారు.

అయితే ప్రస్తుతం మారిన లైఫ్ స్టయిల్ వల్ల అసలు ఆహారం తీసుకోకుండా పూజాకార్యక్రమాలు చేయలేకపోతున్నారు.

దీంతో పూర్తి ఆహార నియమాలు పాటించలేని వారు ద్రవ పదార్థాలు తీసుకుంటూ శివయ్యను పూజించవచ్చు.

మనసులో స్వచ్ఛమైన భక్తితో ఉపవాస నియమాలను పాటిస్తే దానికి ఫలితం దక్కుతుంది. శివరాత్రి రోజు జాగరణ చేయడం వల్ల రాత్రిపూట చేసే శివార్చన వల్ల శరీరంలో ఉత్తేజం వస్తుందని శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి.

శివనామ స్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు

కాగా, తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

శివోహం అంటూ ఆ గరల కంఠుడిని స్మరించుకుంటున్నారు. శివయ్యను దర్శించుకోవడం కోసం తెల్లవారు జాము నుంచే ఆలయాల వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు.

 

 

శ్రీశైలంలోె భక్తుల రద్దీ

ప్రసిద్ధ శ్రీశైలం ఆలయానికి భక్త జనం పోటెత్తింది. దాదాపు అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. మల్లన్న దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది.

శ్రీశైలం ఆలయం శివనామ స్మరణతో మార్మోగి పోతోంది. ఈ రోజు నుంచి శ్రీశైలంలో వైభవంగా మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.

సాయంత్రం స్వామి అమ్మవార్లకు నంది వాహన సేవ జరుగనుంది. నంది వాహనంపై స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

అర్ధరాత్రి పాగాలంకరణ, కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. శ్రీశైలం క్షేత్రానికి 2లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

భక్తుల రద్దీ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తెలంగాణలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం, ఏడుపాయల వనదుర్గా భవానిమాత ఆలయం,

మేడ్చల్‌ జిల్లాలోని కీసరగుట్ట, జోగులాంబ గద్వాల జిల్లాలోని జోగులాంబ ఆలయం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి, కోటగుళ్లు, ములుగు జిల్లాలోని రామప్ప, మహబూబాబాద్‌ జిల్లాలోని కురవి వీరభద్రస్వామి,

హనుమకొండలోని వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం, మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి, జనగామ జిల్లాలోని పాలకుర్తి సోమేశ్వరస్వామి, వరంగల్‌లోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామి, కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాలయం, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌, వనస్థలిపురం, ఓల్డ్‌సిటీలో శివాలయాల్లో శివయ్య దర్శనానికి భక్తులు బారులు తీరారు.

Exit mobile version