Site icon Prime9

విజయవాడ: నదీ స్నానానికి వెళ్లి.. ఐదుగురు యువకులు మృతి

vijayawada-latest-crime-news-five-boys-dead-bodies-found-in-krishna-river

vijayawada-latest-crime-news-five-boys-dead-bodies-found-in-krishna-river

Vijayawada: తమ కుమారులు ఇంకా ఇంటికి రాలేదేంటని ఎదురుచూస్తున్న ఆ కుటుంబాల్లో తీరని విషాదం మిగిలింది. ఆటకని వెళ్లిన పిల్లలు శవాలై వచ్చారు. నదిలో స్నానానికి దిగిన ఆరుగురు యువకుల్లో 5 మంది గల్లంతైన ఘటన శుక్రవారం నాడు కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. కాగా గల్లంతైన ఐదుగురిలో నిన్న రెండు మృతదేహాలు లభించగా, ఈరోజు మరో ముగ్గురి మృతదేహాలు కూడా దొరికాయి.

వివరాల్లోకి వెళ్తే విజయవాడ పటమట ప్రాంతంలోని దర్శిపేట అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన షేక్‌ బాజీ (15), షేక్‌ హుస్సేన్‌ (15), తోట కామేష్‌ (15), మద్దాల బాలు (17), ఇనకొల్లు గుణశేఖర్‌ (14), పిన్నింటి శ్రీను, షేక్‌ ఖాశిం అలీ స్నేహితులు. బాజీ, కామేష్‌ చదువు మానేయగా, హుస్సేన్, గుణశేఖర్‌ తొమ్మిదో తరగతి, బాలు ఇంటర్‌ చదువుతున్నారు. కాగా వీరంతా ఆడుకోవటానికి వెళ్తున్నామని తమతమ ఇళ్లలో చెప్పి యనమలకుదురు వద్ద ఉన్న కృష్ణా నది రేవు వద్దకు చేరుకున్నారు. కొద్దిసేపు అక్కడ క్రికెట్‌ ఆడి, ఆ తర్వాత కొంత సమయానికి తాడేపల్లి పరిధిలోని పాతూరు ఏటిపాయ ఒడ్డు వద్దకు చేరుకున్నారు. పిన్నింటి శ్రీను తప్ప మిగిలిన ఆరుగురు స్నానానికి నదిలోకి దిగారు.

అయితే నదిలో స్నానానికి దిగిన కొద్దిసేపటికే వారంతా మునిగిపోయారు. ఇది గమనించిన శ్రీను గట్టిగా అరుస్తూ స్థానికంగా ఉన్నవారికి సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే నదిలో దూకి ఖాసిం అలీను రక్షించగలిగారు. కానీ అప్పటికే మిగిలిన ఐదుగురు చిన్నారులు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ సమాచారం అందుకున్న పెనమలూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గజ ఈతగాళ్లు, రెవెన్యూ సిబ్బంది సాయంతో హుటాహుటిన గాలింపు చర్యలు చేపట్టగా నిన్న రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈరోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగగా మిగిలిన ముగ్గురి డెడ్ బాడీలు కూడా దొరికాయి.

దానితో దర్శిపేటలో విషాద చాయలు అలుముకున్నాయి. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాల్లో చేతికి అందివచ్చిన కుమారులు ఇలా విగజీవులుగా పడి ఉండడం చూసి వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదీ చదవండి: ఈ మాచర్ల దాడి ఘటనలో ఎవరు? ఎవరిపై దాడి చేస్తున్నారో ఫ్యాక్ట్ చెక్…

Exit mobile version