Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. కబాబ్ లు రుచిగా లేవని కోపంతో.. వాటిని చేసిన వంట మనిషిని కాల్చి చంపారు కొందరు వ్యక్తులు. ఈ ఘటన రాష్ట్రంలోని బరేలీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరేలీ పట్టణంలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో ప్రియదర్శిని నగరలో ఓ పాత కబాబ్ దుకాణం ఉంది. బుధవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు కబాబ్ దుకాణానికి వచ్చారు. అప్పటికే పీకల దాకా దాకిన వారు మైకంలో ఊగిపోతున్నారు. కబాబ్స్ ఆర్డర్ చేయగా.. వాటిని తిన్న ఇద్దరు వ్యక్తలు రుచిగా లేవని యజమానికి ఫిర్యాదు చేశారు.
యజమానితోె తీవ్ర వాగ్వాదం)(Uttar Pradesh)
ఈ విషయంలో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అది కాస్త పెద్దగా అయి యజమానిపై దాడికి ప్రయత్నించారు సదరు వ్యక్తులు. అనంతరం డబ్బులు చెల్లించకుండా తమ కారు దగ్గరకు వెళ్లిపోయారు. దీంతో యజమాని వారి నుంచి డబ్బులు వసూలు చేసుకురమ్మని అక్కడ పనిచేస్తున్న వంట మనిషిని పంపాడు. ఇద్దరు వ్యక్తుల దగ్గరకు వంట మనిషి వెళ్లగా ఆగ్రహంతో ఊగిపోయిన అందులో ఒకరు తుపాకీతో కాల్చాడు. దీంతో వంటమనిషి అక్కడికక్కడే మరణించాడు. వెంటనే ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే దాడి జరుగుతున్న కొంతమంది నిందితులు వచ్చిన కారు ఫొటోలను తీశారు. ఆ ఫొటోలు, సమీపంలోని సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా నిందితులు ఉత్తరాఖండ్ లోని కాశీపూర్ కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వారిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.