Site icon Prime9

Crime News: సుపారీ ఇచ్చి మరీ.. కొడుకుని హత్య చేయించిన తల్లిదండ్రులు

portents killed their son after giving supari

portents killed their son after giving supari

Crime News: పిల్లలపై తల్లిదండ్రులకు ఎనలేని ప్రేమాభినాలు ఉంటాయి. కొడుకు తప్పు చేశాడాని పైకి మందలించినా, లోలోపల అమితమైన ప్రేమ కురిపిస్తుంటారు. ఇంక కన్నపేగును గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకోండి. కానీ ఇందుకు భిన్నంగా తెలంగాణలో ఓ హృదయవిదారక ఘటన జరిగింది. కన్న కొడుకును చంపించేందుకు తల్లిదండ్రులే సుపారీ ఇచ్చిన ఘటన హుజూర్ నగర్ పరిధిలో చోటుచేసుకుంది. వ్యసనాలకు బానిసైన కొడుకు తీరు, ప్రవర్తన పట్ల విసిగిపోయిన ఆ తల్లిదండ్రులు.. ఇలాంటి కొడుకు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అని భావించారో ఏమో కానీ సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించారు.

వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యంపహాడ్‌ వద్ద అక్టోబరు 19న మూసీ నదిలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమయ్యింది. దానిపై కేసు నమోదుచేసుకుని విచారణ చేపట్టిన పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. అవి విన్న పోలీసులు సైతం నిర్ఘాంతపోయారు. ఖమ్మం కు చెందిన క్షత్రియ రామ్‌సింగ్‌, రాణిబాయి దంపతులకు 26 ఏళ్ల వయసున్న కొడుకు సాయినాథ్‌ ఉన్నాడు. డిగ్రీ చదువు మధ్యలోనే ఆపేసిన సాయినాథ్‌, వ్యసనాలకు బానిసగా మారి గత కొన్ని సంవత్సరాలుగా డబ్బుల కోసం తల్లిదండ్రులను హింసించసాగాడు. ఇటీవల కాలంలో కన్నతల్లి పట్ల కూడా తను అనుచితంగా ప్రవర్తించాడు. దానితో కొడుకు ప్రవర్తన పట్ల విసుగు చెందిన తల్లిదండ్రులు కుమారుడిని చంపాలని నిర్ణయించుకున్నారు.

రాణిబాయి తమ్ముడు సత్యనారాయణసింగ్‌ సహాయంతో మిర్యాలగూడ చెందిన ఓ నలుగురు వ్యక్తులైన రమావత్‌ రవిని, పనుగొతు నాగరాజు, బూరుగు రాంబాబు, ధనావత్‌ సాయితో రూ.8 లక్షలు సుపారీ ఇచ్చి హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దానితో పథకం ప్రకారం అక్టోబరు 18న సత్యనారాయణసింగ్‌, రవి కలిసి నల్గొండ జిల్లా కల్లేపల్లిలోని మైసమ్మ దేవాలయం వద్ద పార్టీ చేసుకుందామని సాయినాథ్‌ను తీసుకెళ్లారు. అనుకున్నదే తడవుగా పక్కా ప్లాన్ ప్రకారం సాయినాథ్‌కు ఫుల్ గా మందు తాగించి అతని మెడకు ఉరి బిగించి చంపేశారు. అనంతరం అతని కారులోనే సాయినాథ్ శవాన్ని తీసుకెళ్లి మూసీ నదిలో పడేశారు. మరిసటి రోజు ఆ శవం నదిలో తేలడం వల్ల పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు

ఇంతవరకు బాగానే ఉన్న వార్తల ద్వారా విషయం తెలిసిందంటూ మూడురోజుల తర్వాత వచ్చి కొడుకు శవాన్ని తీసుకెళ్లారు తల్లిదండ్రులు. ఇందులో ఊహించని ట్విస్ట్ ఏంటంటే సీసీ కెమెరాల రికార్డులను పరిశీలిస్తుండగా పోలీసులుకు నది దగ్గర కనిపించిన కారు తల్లిదండ్రులు వేసుకొచ్చిన కారు ఒకటేనని గుర్తించారు. దానితో వారిపై అనుమానంతో రామ్‌సింగ్‌, రాణిబాయి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా అసలు విషయాలు బయటకు వచ్చాయి. కొడుకును తామే చంపించినట్లు ఆ దంపతులు ఒప్పుకొన్నారు. తల్లిదండ్రులు, మేనమామతో పాటు హత్యకు సుపారి తీసుకున్న వారిలో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:  పట్టాలకు అడ్డంగా రాడ్డు.. శబరి ఎక్స్‌ప్రెస్‌ కు తప్పిన ప్రమాదం

Exit mobile version