Site icon Prime9

Crime News : మద్యం తాగొద్దని మందలించినందుకు నిద్రిస్తున్న భార్యభర్తలపై పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగుడు..

latest crime news about man set fire on couple

latest crime news about man set fire on couple

Crime News : అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం సజ్జలదిన్నెలో దారుణం చోటుచేసుకుంది. మద్యం తాగొద్దని మందలించినందుకు దంపతులపై ఓ వ్యక్తి పెట్రోల్‌ పోసి నిప్పంటించిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. వారితో పాటు సమీపంలో నిద్రిస్తున్న బాలికకు కూడా మంటలు అంటుకున్నాయి. ఈ అమానుష ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎల్లనూరు మండలం వేములపల్లెకు చెందిన నల్లపురెడ్డి, కృష్ణవేణమ్మ గత కొన్నేళ్లుగా తాడిపత్రి పరిధిలోని సజ్జలదిన్నె వద్ద ఉన్న పరిశ్రమలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.

అయితే అదే పరిశ్రమలో పనిచేస్తున్న వీరి సమీప బంధువు రమేశ్‌రెడ్డి మద్యానికి బానిసయ్యాడు. దీంతో నల్లపురెడ్డి గత మూడు రోజులుగా రమేశ్ రెడ్డిని మందలిస్తూ మద్యం తాగొద్దని సూచిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి ఆరు బయట మంచంపై నిద్రిస్తున్న నల్లపురెడ్డి, కృష్ణవేణి దంపతులపై రమేశ్‌రెడ్డి పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో దంపతులతో పాటు అక్కడే నిద్రిస్తున్న పూజిత అనే బాలికకూ మంటలు అంటుకున్నాయి.

ఈ ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు కాగా.. బాలిక స్వల్పంగా గాయపడింది. గమనించిన స్థానికులు భార్యాభర్తలను తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వారిని కర్నూలుకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు.

Exit mobile version