Theft Case : సాధారణంగా దొంగతనాలు అంటే ఇంట్లో లేదా షాప్స్ లో ఎవరు లేని సమయంలో వచ్చి సొమ్ము కాజేయడం ఒక పద్దతి. కొన్ని ఘటనల్లో అందరూ చూస్తుండగానే మారణాయుధాలతో బెదిరించి డబ్బులు, నగలు విలువైన వస్తువుల్ని ఎత్తుకెళుతుంటారు. అయితే కొన్ని సార్లు మాత్రం దొంగతనాల్లోనే పలు వింత ఘటనలను చూస్తూ ఉంటాం. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన కూడా ఆ కోవలోకే వస్తుంది అని చెప్పాలి.
ప్రకాశం జిల్లా కనిగిరిలో ఓ హోటల్ లో దొంగతనానికి వచ్చిన ఓ దొంగ.. ముందుగా దుకాణాల్లో ఉన్న కూల్ డ్రింకును తాగి.. కొంచెం సేపు పడుకొని.. ఆ తర్వాత కౌంటర్ లో ఉన్న రూ.1.35 లక్షలతో పారిపోయాడు. ప్రస్తుతం ఈ దొంగతనం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్ సమీపంలో గల నక్షత్ర, మినర్వా హోటల్ లను ఎప్పటి లానే యజమాని షేక్ ఖాజా బుధవారం రాత్రి తాళాలు వేసి ఇంటికి వెళ్లారు.
అయితే గురువారం తెల్లవారుజామున నక్షత్ర హోటల్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. క్యాష్ కౌంటర్ లో ఉన్న రూ.1.20 లక్షల నగదును చోరీ చేశాడు. ఆ తర్వాత ఫ్రిజ్లో ఉన్న కూల్ డ్రింక్ తాగేసి కాసేపు విశ్రాంతి కూడా తీసుకుని.. పక్కనే ఉన్న మినర్వా హోటల్ లో చోరీకి ప్రయత్నించాడు. మినర్వా హోటల్ తలుపులు పగలగొట్టి.. లోపలికి ప్రవేశించిన అనంతరం నగదు కౌంటర్ లోని రూ.15వేలు తీసుకొని పరారయ్యాడు. ఉదయం హోటల్ తెరవడానికి వచ్చిన యజమాని చోరీ జరిగిన సంగతి గమనించి పోలీసులను ఆశ్రయించాడు. అప్పుడు సీసీ కెమెరాలను పరిశీలించగా జరిగిన ఉదంతం బయటపడింది. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.