Smartphone Companies: భారత్ దెబ్బకు చైనా కంపెనీల అబ్బా అంటున్నాయి. ఇన్నాళ్లూ యథేచ్ఛగా నిబంధనలకు విరుద్ధంగా ఇండియాలో వ్యాపారం సాగించాయి. కాగా తాజా కేంద్ర ప్రభుత్వం చైనా కంపెనీల వ్యాపార లావాదేవీలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో అక్రమ వ్యాపారం చేస్తున్న కంపెనీలపై ఉక్కుపాదం మోపుతోంది. దీంతో బెంబేలెత్తిన కొన్ని చైనా కంపెనీలు భారత్ కు గుడ్ బై చెప్తున్నాయి.
భారత మొబైల్ మార్కెట్‌లో చైనా కంపెనీలదే అత్యధిక వాటా. తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు లభిస్తుండడంతో వినియోగదారులు ఎక్కువగా చైనా కంపెనీ ఫోన్లవైపే ఆకర్షితులయ్యేవారు. కాగా తాజాగా భారత్ లో చైనా కంపెనీలకు భారీ షాక్ తగిలింది. మొబైల్ మార్కెట్‌ను ఒక ఊపు ఊపిన చైనా కంపెనీలు క్రమంగా భారత్‌ను వీడుతున్నాయి.
తమ వ్యాపార నిర్వహణకు అనువైన దేశాల వైపు మొగ్గు చూపుతున్నాయి. తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ఇండియాలో తన కార్యకలాపాల్ని నిలిపివేయనున్నట్లు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. భారత్ దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థల్ని ప్రోత్సహించేందుకు చైనా కంపెనీలపై భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని.. భారత్‌లో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలకు చెందిన ప్రతినిధులు చెప్పారని ఆ కథనంలో పేర్కొనింది.
2021 డిసెంబర్‌లో పన్ను ఎగ్గొట్టి చైనాలో తన పేరెంట్ కంపెనీలకు అక్రమంగా నిధుల్ని మళ్లించిందనే ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చైనా స్మార్ట్‌ఫోన్ సంస్థ ఒప్పో వివో షావోమీతోపాటు ఇతర చైనా సంస్థలపై దాడులు నిర్వహించాయి. ఈడీ దాడుల్లో వివో కంపెనీ భారత్‌లో పన్నులు ఎగొట్టి దాదాపు 50 శాతం నిధులను చైనాకు తరలించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 2017 నుంచి 2021 మధ్య కాలంలో రూ.62,476 కోట్లు చైనా తరలినట్లు ఈడీ తెలిపింది. ఇక ఒప్పో కూడా వస్తువుల విలువను తక్కవ చేసి చూపించడం ద్వారా పన్నులు ఎగ్గొట్టినట్టు ఈడీ అధికారులు తెలిపారు. మరో కంపెనీ షావోమి కూడా రూ.653 కోట్లు ఎగవేతకు పాల్పడిన నేపథ్యంలో ఈ మూడు సంస్థలకు ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే భారత్‌కు చైనా కంపెనీలు గుడ్ బై చెప్పడం ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: Google: గూగుల్ మిస్టేక్.. సెక్యూరిటీ ఇంజనీర్ అక్కౌంట్ లోకి రూ.2 కోట్లు బదిలీ