Site icon Prime9

Iconic Cable Bridge: ఏపీ- తెలంగాణ మధ్య ఐకానిక్ వంతెన.. దేశంలోనే మొదటిదిగా..!

iconic cable bridge between ap and telangana

iconic cable bridge between ap and telangana

Iconic Cable Bridge: దేశంలోనే మొట్టమొదటి ఐకానిక్‌ కేబుల్‌ కమ్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జిని తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ మధ్య నిర్మించనున్నారు. కృష్ణా నదిపై రూ.1,082.56 కోట్ల అంచనా వ్యయంతో 30 నెలల్లోనే ఈ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జిని పూర్తిచేసేందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డురవాణా, హైవేల మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా-కర్నూలు జిల్లా మధ్య సోమశిల వద్ద ఉన్న కృష్ణానదిపై ఇది నిర్మితం కానుంది. ఈ కేబుల్ బ్రిడ్జి కనుక పూర్తయితే ప్రపంచంలో రెండోదిగా, దేశంలో మొట్టమొదటి బ్రిడ్జిగా చరిత్రకు ఎక్కుతుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం ద్వారా హైదరాబాద్‌ నుంచి తిరుపతికి ప్రయాణ దూరం సుమారు 80 కిలోమీటర్లు తగ్గుతుందని గడ్కరీ తెలిపారు. దీనికి రెండువైపుల అనగా తెలంగాణ వైపు లలితా సోమేశ్వరస్వామి ఆలయం, ఆంధ్ర వైపు సంగమేశ్వర స్వామి ఆలయం ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ వంతెన చుట్టూ శ్రీశైలం జలాశయం, నల్లమల అడవులు, ఎత్తైన కొండలతో ప్రకృతి రమణీయంగా పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటుందన్నారు. ఇది ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అలరారేందుకు కూడా అవకాశం ఉందని గడ్కరీ తెలిపారు. పాదచారులు నడిచేందుకు వీలుగా ఈ వంతెనపై పొడవైన గ్లాస్‌ వాక్‌వే ఉంటుందని, గోపురం వంటి పైలాన్లు ఉంటాయని కేంద్ర మంత్రి వివరించారు.

ఇదీ చదవండి: తండ్రీకొడుకుల దారుణ హత్య

Exit mobile version