Telugu Desam Party : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని కందుకూరులో విషాద ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, పలువురు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం మరువక ముందే మరో దారణం జరిగింది. ఆదివారం గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట కారణంగా 3 మహిళలు మృతిచెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
గుంటూరు వికాస్ నగర్ లో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన సభలో విషాదం నెలకొంది. ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీలో జరిగిన తొక్కిసలాటలో ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రన్న కానుకులు పేరుతో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున మహిళలను, వృద్ధులను ఆహ్వానించారు. ఈ క్రమంలో జనం ఒక్కసారిగా దూసుకురావడంతో తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో జనం మధ్య ఊపిరాడక ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. చికిత్స పొందుతూ మరో 2 మరణించినట్లు సమాచారం అందుతుంది. మరొకరి పరిస్థితి విషమంగా వైద్యులు తెలిపారు.
కందుకూరు ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి మోదీ, సీఎం జగన్ రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున ఎక్స్ గ్రేషియాను అందజేస్తామని ప్రకటించారు. కొద్ది రోజుల వ్యవధిలోనే మళ్ళీ ఈ దుర్ఘటన జరగడం పట్ల తెదేపా నేతలు ఆందోళన చెందుతున్నారు.