Karnataka: కష్టించి పండించిన పంటకు మద్ధతు ధర రాకపోతే ఆ రైతన్న ఆవేదన వర్ణనాతీతం. తాను ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటను మార్కెట్లో అమ్మితే నాలుగు రూపాయలు కళ్లజూడొచ్చని ఎంతో ఆశపడతారు రైతులు. రేటు కొంచెం ఎక్కువ పలుకుతుందని తెలిసినా పంటను తీసుకుని ఎంత దూరమైన వెళ్తారు. అయితే తీరా అక్కడ పంట మొత్తం అమ్మాక దారి ఖర్చులకూ సరిపడిన సొమ్ము కూడా అందకపోతే ఆ రైతన్న బాధ అంతా ఇంతా కాదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే కర్ణాటకకు చెందిన ఓ ఉల్లి రైతుకు ఎదురైంది. తాను పండించిన 205 కిలోల ఉల్లిగడ్డను 415 కిలోమీటర్లు ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు పెట్టుకుని మరీ తీసుకెళ్లగా ఆయనకు అన్ని ఖర్చులు పోయి చివరకు చేతికి అందింది కేవలం రూ. 8.36 పైసలు. ఈ షాకింగ్ సంఘటనకు సంబంధించిన ఓ రసీదు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
కర్ణాటకలోని గడాగ్ జిల్లాకు చెందిన పెవడెప్ప హళికేరి ఉల్లి గడ్డ సాగుచేశారు. వర్షాలు ఎక్కువగా కురవడంతో దిగుబడితో కొద్దిగా తగ్గింది. దానితో పంట నికరంగా 205 కిలోలు తేలింది. స్థానికంగా మంచి ధర పలకదనే ఉద్దేశంతో మరికొంతమంది రైతులతో కలిసి 415 కిలోమీటర్ల దూరంలో ఉన్న యశ్వంత్ పూర్ మార్కెట్ కు ఉల్లిని తీసుకెళ్లాడు. అక్కడ కూడా నిరాశజనంగానే రేటు పలికింది. సరేనని గత్యంతరం లేక దారిఖర్చులకు వచ్చినా చాలు అనుకుంటూ క్వింటా రూ. 200 చొప్పున అమ్మాడు. అయితే, దారిఖర్చులకు కాదు కదా.. దారిలో టీ తాగేందుకు సరిపడా సొమ్ము కూడా చేతికి రాలేదని ఆ రైతు వాపోయాడు.
This is how The double engine Govt of @narendramodi & @BSBommai doubling the income of farmers (Adani)
Gadag farmer travels 415 km to Bengaluru to sell onions, gets Rs 8.36 for 205 kg! pic.twitter.com/NmmdQhAJhv
— Arjun (@arjundsage1) November 28, 2022
పంట మొత్తం తీసుకున్న వ్యాపారి లెక్కలు కట్టి తన చేతిలో రూ.8.36 పైసలు పెట్టడంతో పెవడెప్ప అవాక్కయ్యాడు. ఇదేంటని అడిగితే.. మొత్తం 205 కిలోలకు రూ.410. అందులో ఫ్రైట్ చార్జీలు రూ.377.64, హమాలీ ఖర్చు రూ.24 లను తీసేస్తే మిగిలేది రూ.8.36 పైసలేనని లెక్కచెప్పాడట. పంట పండించేందుకు తనకు సుమారు రూ.25 వేల దాకా ఖర్చయిందని రైతు చెప్తూ కన్నీరు కార్చారు. తనలాగా మరో రైతు ఇబ్బంది పడకూడదని, యశ్వంత్ పూర్ మార్కెట్ కు రావొద్దని చెప్పాడు. కాగా, పెవడెప్ప పంట అమ్మకానికి సంబంధించిన రసీదును ఓ వ్యక్తి ట్విట్టర్ లో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇదీ మన దేశంలో రైతుల దుర్బర పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: భారీగా పడిపోయిన టమాట ధరలు.. ఆందోళనలో అన్నదాతలు