Operation Ajay: ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి మొదటి చార్టర్ విమానం గురువారం రాత్రి టెల్ అవివ్ లోని బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. ఈ విమానంలో 212 మంది భారతీయులు తిరిగి స్వదేశానికి వచ్చారు. వారికి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలికారు. ఇజ్రాయెల్-పాలస్థీనాల మధ్య యుద్ధ భయాల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులు తమను స్వదేశానికి తిరిగి తీసుకెళ్లాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.
వెంటనే స్పందించిన ప్రభుత్వం.. ఆపరేషన్ అజయ్ పేరుతో వారిని తిరిగి రప్పించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇజ్రాయెల్, గాజా ల పరస్పర రాకెట్ల దాడులతో 2 వేల 500 మంది చనిపోయారు. 5 వేలకు పైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ లో ఇలాంటి పరిస్థితిని చూడటం ఇదే తొలిసారి. మమ్మల్ని తిరిగి తీసుకువచ్చినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. యుద్ధ భయాలు త్వరగా తొలగిపోతాయని ఆశిస్తున్నాం. తద్వారా మేము అక్కడికి తిరిగి వెళ్ళగలం”అని ఓ ప్రయాణికుడు తన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయులకు వీలుగా ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించినట్లు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే.