Torrential Rains: అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో కురిసిన భారీ వానలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని 5 జిల్లాలకు రెడ్ అలెర్ట్, 20 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. హైదరాబాద్‌లో అన్ని జోన్లకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అటు, ఏపీలో కూడా రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాని అధికారులు హెచ్చరించారు. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి జిల్లాల్లో కుంభవృష్టి కురిసే అవకాశముండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. మిగిలిన జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో మోస్తారు నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు అధికారులు.
భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి నీటిమట్టం..(Torrential Rains)
భారీ వర్షాలతో వరంగల్ నగరం అతలాకుతలమైంది. రాత్రి నుంచి వర్షం దంచికొట్టడంతో లోతట్టు ప్రాంతాలు, కాలనీలు నీటిమయం అయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. ప్రజలు నానా ఇబ్బందులకు గురయ్యారు. ముంపు ప్రాంతాల ప్రజలను ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారయంత్రాంగం పునరావాస కేంద్రాలకు తరలించారు. నగరంలోని 70కిపైగా కాలనీలు ఇంకా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలకు ములుగు జిల్లాలో వాగు పొంగిపొర్లుతున్నాయి. తాడ్వాయి మండలంలోని జంపన్న వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతికి నార్లపూరం గ్రామపంచాయితీలోని పడిగాపుర్, ఎలుబాక గ్రామాలు గత నాలుగు రోజులుగా జదిగ్బంధంలో చిక్కుకున్నాయి.భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గోదావరి ఉపనదులైన ఇంద్రావతి, ప్రాణహిత నదుల్లో కూడా నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అటు కడెం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులతో పాటు కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలో వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 42 అడుగులకు చేరుకుంది. మరో అడుగు పెరిగి 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీయ చేయనున్నారు అధికారులు.ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గత నాలుగు రోజులకు ముందు భారీ వర్షాల కారణంగా వాటర్ లెవెల్స్ పెరగడంతో ఆరు గేట్లు ఎత్తారు అధికారులు. వరద ప్రవాహం తగ్గడంతో రెండు గేట్లు మూసేశారు. ప్రస్తుతం వరద ప్రవాహం పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
నంద్యాలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కుండపోత వానతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో రాకపోకల కోసం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా ప్రైవేట్ స్కూల్స్‌కు సెలవు ప్రకటించారు యాజమాన్యాలు. నెల్లూరు జిల్లాలో ఆకాశం మేఘావృతమైంది. అప్పుడప్పుడు జల్లులు కురుస్తున్నాయి. రోడ్లపై నీరు నిలబడడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. జనజీవనం అసౌకర్యానికి గురవుతున్నారు. జల్లులకే ఇలా ఉంటే పూర్తిస్థాయిలో వర్షాలు కురిస్తే సిటీ పరిస్థితి ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది.
ఏలూరు జిల్లా పశ్చిమ ఏజెన్సీలో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండ కాలువలు పొంగిపొర్లుతున్నాయి. వాగులు ఉప్పొంగడంతో 18 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బుట్టాయిగూడెం మండలం రెడ్డిగణపవరం వద్ద కొండవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాగు దాటోద్దని అధికారులు హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్ర కాలువ జలాశయానికి కూడా వరద నీరు చేరుతోంది.
నల్లమల అటవీ ప్రాంతం సరికొత్త అందాలను సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వానలు కురుస్తుండడంతో దట్టమైన నల్లమలలో వాగులు, వంకలు జలసవ్వడులు చేస్తున్నాయి. కొండ సిగల నుంచి జాలువారుతున్న జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఓ వైపు కొండలు, కోనలు, మరోవైపు పచ్చని చెట్ల మధ్య పాలనురగ్గలాంటి వాటర్ ఫాల్స్ చూపరులను ఆట్టుకుంటున్నాయి. సుమారు 100 నుంచి 200 అడుగుల ఎత్తయిన కొండల మీద నుంచి జలపాతాలు కిందకు దూకుతున్నాయి.