Kishan Reddy: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా.. రాజకీయంగా కూడా సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం ఒక్కటేనా(Kishan Reddy)
‘ఈడీ నోటీసులతో మాకు సంబంధం లేదు. చట్టం ముందు అందరూ ఒక్కటే. కవితకు ఈడీ నోటీసులిస్తే తప్పేముంది. దర్యాప్తు సంస్థల విషయంలో బీజేపీ జోక్యం చేసుకోదు.
వాళ్లు చేసిన అవినీతి వ్యవహారాన్ని తెలంగాణ ప్రజలతో ముడిపెట్టి రెచ్చగొడుతున్నారు. లిక్కర్ స్కామ్ కేసు విషయంలో నీతివంతులైతే ఎందుకు గగ్గోలు పెడుతున్నారు?.
కవితను తలవంచమని ఎవరు చెప్పటం లేదు. తప్పు చేయకపోతే నిజాయితీని నిరూపించుకోవచ్చు. తెలంగాణ సమాజం అంటే కేసీఆర్ కుటుంబం ఒక్కటేనా?.
చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఢిల్లీకి వెళ్లి లిక్కర్ వ్యాపారం చేసింది, సెల్ ఫోన్ పోన్లు పగల కొట్టింది, అక్రమార్కులతో చేయి కలిపింది ఎవరో తేల్చాలి.
తమ తప్పిదాలు, అవినీతి, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే తెలంగాణ ప్రభుత్వం నాటకాలు చేస్తోంది. బీజేపీ, ప్రధాని మోదీని టార్గెట్ చేసి నిత్యం అసత్య ఆరోపణలు చేస్తున్నారు.
తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీ అవినీతికి పాల్పడుతోంది. రాష్ట్రంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థలను ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తున్నారు.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీ చెప్పినట్టు ఆడుతోంది. పోలీసులు కూడా భూముల సెటిల్ మెంట్స్ చేస్తున్నారు. ’అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
వ్యాపారులను బెదిరించి సెటిల్ మెంట్స్
హైదరాబాద్‌లో వ్యాపారులను బెదిరించి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ప్రభుత్వం నిర్భంధంలో ఉన్నారని ఆయన విమర్శలు చేశారు.
తెలంగాణలో ఇసుక, లిక్కర్, మైనింగ్ మాఫియా శాసిస్తోందన్నారు. పాదయాత్రలు, బహిరంగ సభలపై నిర్బంధం విధిస్తున్నారని తెలిపారు.
కొనుగోలు చేయడంలో కేసీఆర్ దిట్ట అని.. మహిళ అనే గౌరవం లేకుంగా గవర్నర్ తమిళిసై పై బీఆర్‌ఎస్ నేతలు, మంత్రులు ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు.
శాసనసభ ప్రగతిభవన్ కనుసన్నల్లోనే శాసనసభ నడుస్తోందన్నారు. గతంలో ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన ప్రభుత్వాలు లేవని ఆయన మండిపడ్డారు.