Mekapati Chandrashekar Reddy : వైకాపా నుంచి తనను సస్పెండ్ చేయటంతో తలపై భారం తొలగినట్లైందని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన బెంగళూరులో విలేకర్లతో మాట్లాడారు. అధికారం ఉందన్న అహంకారంతోనే తనను పార్టీ నుంచి తొలగించారని ముఖ్యమంత్రి జగన్‌పై పరోక్షంగా నిప్పులు చెరిగారు. పార్టీలో పరిస్థితి పైకి కనిపిస్తున్నంత సవ్యంగా లేదని, కొద్ది మంది పెత్తనమే నడుస్తోందని ధ్వజమెత్తారు. ‘నేను వేసిన ఓటుతోనే జయమంగళ వెంకటరమణ గెలిచారు. ఈ విషయంపై దేవుడిపై ప్రమాణం చేస్తా.. నాపై ఆరోపణలు చేసేవారు అలా చేయగలరా?’ అని చంద్రశేఖరరెడ్డి సవాల్ చేశారు.
‘ఎన్నికల సందర్భంగా పార్టీ ఏం చెబితే అది చేశా. ఇందులో నా సొంత అభిప్రాయం, నా నియోజకవర్గ కార్యకర్తల పాత్ర ఏ మాత్రం లేదు. వైకాపాలో లేకున్నా నా భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదు. రానున్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో పార్టీ ఓడిపోవటం మాత్రం ఖాయం. ఇప్పుడు నేను స్వతంత్రుణ్ని.. నేను ఎలా ఓటేశానో, పార్టీ నన్ను ఎలా తొలగించిందో ప్రజలకు చెప్పి రానున్న ఎన్నికలను ఎదుర్కొంటాను’ అని తేల్చి చెప్పారు.
వైసీపీలో 50 మంది ఎమ్మెల్యేలను తీసేస్తారని ప్రచారం జరుగుతోందని వెల్లడించారు. వై నాట్ 175 అని జగన్ ఏ ధైర్యంతో అనగలుగుతున్నారో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. అధినాయకత్వం వద్దకు తమ వంటి సీనియర్లు వెళితే పలకరించే దిక్కు కూడా లేదని వాపోయారు. తన కుటుంబానికి, వైఎస్ కుటుంబంతో మంచి సంబంధాలున్నా ఏనాడూ ముఖ్యమంత్రితో సొంత విషయాలు మాట్లాడలేదన్నారు. ఇన్నేళ్ల కాలంలో ఒకటి రెండుసార్లు మాత్రమే సీఎం కార్యాలయానికి వెళ్లానని వివరించారు. అలాగని ఆయనతో వైరుధ్యమేమీ లేదన్నారు. చెప్పుడు మాటలు వింటే పార్టీకి వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు చాలా తగ్గుతాయన్నారు.
నాకు ఎమ్మెల్సీ ఇస్తానన్నారు (Mekapati Chandrashekar Reddy)..
“నా నియోజకవర్గంలో నేనండీ ఎమ్మెల్యేని. అలా కాకుండా, ఎవరో తాడుబొంగరం లేని వాళ్లను తీసుకువచ్చి, ఆయన చెప్పినట్టు వినండి అంటూ అధికారులకు సూచిస్తున్నారు. ఎమ్మెల్యేలకు సీఎం సరైన గౌరవం ఇవ్వడంలేదు. సీఎం సరే.. ఆయన పక్కనున్న వాళ్లు కూడా ఎమ్మెల్యేకి నమస్కారం పెట్టరు. సీఎం పక్కన పెద్ద సంఖ్యలో సలహాదారులు ఉంటారు.. వాళ్లు చేసే పనేంటి? ఎమ్మెల్యేలకు విలువ, గౌరవం ఇవ్వని పార్టీలు మూతపడక తప్పదు. నాడు అధికారాన్ని తృణప్రాయంగా వదిలేసి రాజీనామాలు చేసి జగన్ వెంట నడిచి, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన కుటుంబం మాది. మీరు నన్ను తప్పుబడతారా? శేఖరన్నా.. గెలిచినా, ఓడినా టికెట్ నీదే అని ఒక్క మాట అంటే ఎంత సంతోషపడతాను? కానీ నాకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు.. ఎమ్మెల్సీ వద్దని జగన్ తో చెప్పాను” అని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వివరించారు.
టికెట్ దక్కకూడదనే..
వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్ దక్కకూడదన్న లక్ష్యంతోనే కొందరు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మేకపాటి దుయ్యబట్టారు. ‘ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిని కలిశా. తోటి ఎమ్మెల్యేలతోనూ మాట్లాడా. కొందరు కుట్రపూరితంగానే నాపై ఆరోపణలు ప్రచారం చేస్తున్నారు. నా ఇంటి ముందు ఫ్లెక్సీలను ఎన్నికల నియమావళి ప్రకారమే తొలగించారు. అందులో నా ప్రమేయం ఏమీ లేదు. కానీ దాన్నీ రాజకీయం చేస్తున్నారు. పైగా నేను క్రాస్ ఓటింగ్ చేసేందుకు రూ.20 కోట్లు చేతులు మారాయన్న ఆరోపణ వినిపిస్తోంది. నాకు డబ్బుకు కొదవ లేదు. రాజకీయాల నుంచి తప్పుకున్నా హాయిగా బతకగలను. నాకు ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఆస్పత్రి బిల్లు రూ.10 లక్షలైతే ప్రభుత్వం రూ.లక్ష మాత్రమే ఇవ్వజూపింది. ఆ సొమ్మును ముఖ్యమంత్రికే తిరిగి ఇచ్చా. అలాంటి నాకు డబ్బులకు ఆశపడాల్సిన అవసరం ఏముంటుంది అని అన్నారు.
పార్టీలో ఏ ఎమ్మెల్యేకీ గౌరవం లేదు..
పార్టీకి నేను వెన్నుపోటు పొడవటం కాదు.. నాకే సీఎం వెన్నుపోటు పొడిచారని మేకపాటి వ్యాఖ్యానించారు. ‘గతంలో పార్టీ కోసం నాలుగేళ్లుండగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా. ఇప్పుడు మా అవసరం లేదనే మమ్మల్ని తొలగించి గుణపాఠం చెప్పారు. ప్రస్తుతం పార్టీలో ఏ ఎమ్మెల్యేకూ గౌరవం లేదు. ఇన్నాళ్లూ అవమానాలు భరిస్తూ వచ్చాం. ఇకనైనా గౌరవంగా బతికే అవకాశం దక్కింది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నాకు పదవులపై ఆశ లేదు’ అని చెప్పారు.