Site icon Prime9

Bandi Sanjay Arrest : టెన్త్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ అరెస్టు..

bandi sanjay arrest in 10th class exam paper leak issue

bandi sanjay arrest in 10th class exam paper leak issue

Bandi Sanjay Arrest : తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అరెస్టు అయ్యారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ ఘటనలో బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈ మేరకు మంగళవారం అర్థరాత్రి కరీంనగర్‌ లోని ఆయన నివాసానికి వెళ్లి బండిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించి బీజేపీ కార్యక్తలను ఎందుకు అదుపులో తీసుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. పోలీసుల సమాధానం చెప్పకుండా..బండి సంజయ్ ని బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో బండి సంజయ్ నివాసం వద్ద తీవ్ర పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. బండి సంజయ్ ను తీసుకువెళుతుండగా బీజేపీ కార్యక్తరలు అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు భారీగా మోహరించి పోలీసులు బండి సంజయ్‌ను అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. కరీంనగర్ దాటిన తర్వాత ఎల్.ఎండీ వద్ద వాహనం మొరాయించడంతో బండి సంజయ్ ని మరో వాహనంలో బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు సంజయ్ ను తరలించారు పోలీసులు.

కాగా బండి సంజయ్‌ అత్తగారు ఇటీవల చనిపోగా.. 9 రోజుల కార్యక్రమం బుధవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జ్యోతినగర్‌లోని వారి ఇంటికి సంజయ్‌ వచ్చారు. పోలీసులు బలవంతంగా సంజయ్‌ను అరెస్ట్ చేశారని.. కనీసం టాబ్లెట్‌ వేసుకునే సమయం కూడా ఇవ్వలేదన్నారు బండి సంజయ్‌ సతీమణి అపర్ణ.  తన భర్త అరెస్టు సమయంలో కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారని ఆరోపించారు. ఆయనకు గతంలో గుండెపోటు వచ్చిందని అపర్ణ గుర్తు చేశారు.

హన్మకొండ జిల్లా కమలాపూర్‌లోని పరీక్షా కేంద్రం నుంచి మంగళవారం 10వ తరగతి హిందీ పేపర్‌ను బయటకు తీసుకొచ్చిన కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ కార్యకర్త బురం ప్రశాంత్ ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ ద్వారా బండి సంజయ్ కి పంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సోమవారం కూడా బండి సంజయ్ ప్రశాంత్‌తో మాట్లాడినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. దీంతో పోలీసులు బండిని అదుపులోకి తీసుకున్నారు. లీకైన కొశ్చన్ పేపర్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వద్దకు కూడా చేరిందని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఉదయం 9.45 గంటలకు ఈ కొశ్చన్ పేపర్‌ను ఫోటో తీసినట్లు వివరించాడు. 11.24 గంటలకు బండి సంజయ్‌ ఫోన్‌కు పేపర్‌ వచ్చిందని తెలిపారు.

కాగా బండి సంజయ్‌ను యాదాద్రి జిల్లా బొమ్మల రామారాం పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో అక్కడికి బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. బండి సంజయ్‌ను వెంటనే విడుదల చేయాలని ఆందోళనలు చేపడుతున్నారు. తన అరెస్ట్‌పై లోక్‌సభ స్పీకర్‌కు వెంటనే బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. తనను అర్థరాత్రి అక్రమంగా అరెస్ట్ చేశారని, ఎలాంటి అరెస్ట్ వారెంట్ ఇవ్వకుండానే పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకుని వెళ్లినట్లు కంప్లైంట్ చేశారు. ఎంపీ అని కూడా చూడకుండా అర్థరాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు టెన్త్ పేపర్ లీకేజీ ఘటనలపై ఇవాళ ప్రెస్‌మీట్ నిర్వహించేందుకు బండి సంజయ్ రెడీ అయ్యారు. బండి సంజయ్ అరెస్ట్‌ను రాష్ట్ర బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడాన్ని తప్పుబడుతున్నారు. ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని బండిని అక్రమంగా అరెస్ట్ చేసిందని ఆరోపిస్తున్నారు.

 

Exit mobile version