Site icon Prime9

Hyderabad : ముస్లిం ఇంట్లో అయ్యప్ప పీఠం.. 41 రోజులు పూజలు, నిష్ఠగా దీక్ష పూర్తి చేసిన అయ్యప్ప స్వాములు

ayyappa-puja-in-muslim-house-in-hyderabad-got-trending

ayyappa-puja-in-muslim-house-in-hyderabad-got-trending

Hyderabad : హిందూ ముస్లింల ఐక్యతకు, మత సామరస్యానికీ ఇంతకంటే మంచి ఉదాహరణ మరొకటి ఉండదేమో.
ముస్లింలు అత్యధికంగా ఉండే ప్రాంతంలో.. ముస్లిం కాలనీలో.. అందులోనూ ఒక ముస్లిం ఇంట్లో ఉండి.. అయ్యప్ప దీక్ష తీసుకుని, పీఠం పెట్టుకుని 41 రోజుల పాటు నిష్ఠగా పూజలు చేయడం.. దానికి ఆ ఇంటి యజమాని అంగీకరించడం, సహకరించడం అంటే ప్రత్యేకమే కదా. పరమత సహనానికి ఉదాహరణగా నిలిచే ఈ ప్రత్యేక కథనం మీ కోసం..

హైదరాబాద్‌లో యూసఫ్‌గూడ..
కాలనీ పేరు తాహిర్ విల్లే
ఇంటి యజమాని ఖాదర్ ఉన్నీసా
ఒక పక్క సెయింట్ మేరీస్ కాలేజీ. కొంచెం దూరంలోనే మసీదు.

ఇక్కడే మహేశ్, అతని ఫ్రెండ్స్ కొంతకాలంగా ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారు.
అదే ఇంట్లో ఒక పోర్షన్‌లో న్యాయవాది కూడా అయిన ఇంటి యజమాని ఖాదర్ ఉన్నీసా నివసిస్తున్నారు.
వీళ్లు అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలని, పీఠం కూడా ఇక్కడే పెట్టుకోవాలని అనుకున్నారు. ఆ విషయాన్నే ఇంటి ఓనర్‌కు చెప్పారు. ప్రోగ్రెసివ్‌గా ఆలోచించే ఖాదర్ ఉన్నీసా అందుకు అంగీకరించడమే కాదు.. వారికి వినాయకుడు, లక్ష్మీ దేవిల ప్రతిమలను కూడా గిఫ్ట్‌గా ఇచ్చారు.

అభ్యంతరాలు వచ్చినా యువకులకు అండగా నిలిచిన ముస్లిం మహిళ… 

ఇలా ఒక ముస్లిం ఇంట్లోనే అయ్యప్ప పీఠం పెట్టుకుని, దీక్ష ప్రారంభించారు ఈ యువకులు, వీరి స్నేహితులు.
దాదాపు పది మంది.. అంతా యువరక్తంతో ఉన్నవాళ్లే.. దీంతో తెల్లవారుజామునే పూజ చేస్తూ ఉత్సాహంగా పాటలు పాడటం, అయ్యప్ప స్వామి మీద భక్తితో భజనలు చేయడం మొదలు పెట్టారు.
చాలా సైలెంట్‌గా ఉండే ఈ కాలనీలో వీళ్లు ఇలా తెల్లవారుజామునే బిగ్గరగా భజనలు చేస్తుండటంతో కొందరు ఇబ్బంది పడ్డారు.

పక్కనే ఆసుపత్రి కూడా ఉండటంతో రోగులకూ ఇబ్బంది కలుగుతుంది అనే అభ్యంతరాలు వచ్చాయి. ఈ విషయాన్ని ఇంటి యజమాని ఖాదర్ ఉన్నీసా దృష్టికి తీసుకెళ్లారు. ఇబ్బందులు తప్పవేమోననే ఆందోళన మొదలైంది. అయ్యప్ప స్వామి దీక్ష చేపడితే చాలా నియమాలు ఉంటాయి. ఎంతో నిష్టగా పూజ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి అయ్యప్ప పీఠాన్ని పెట్టుకుంటే.. దీక్ష పూర్తయ్యి, శబరిమల వెళ్లి తిరిగి వచ్చేదాకా ఆ పీఠాన్ని కదపకూడదు. దీక్ష విరమించేప్పుడు మాత్రమే పీఠాన్ని కదపాలి.

ఇవన్నీ ఆలోచించుకుంటూ అయ్యప్ప స్వాములంతా ఆందోళనతో ఉంటే.. ఆ ఇంటి యజమాని ఖాదర్ ఉన్నీసా మాత్రం.. అయ్యప్ప స్వాములపై వచ్చిన అభ్యంతరాలు అన్నింటినీ కొట్టిపారేశారు. వారు తన ఇంట్లోనే ఉంటారని, దీక్ష కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఆజాన్ సమయంలో పాటలు, భజనలు ఆపి… 

ఖాదర్ ఉన్నీసా ధైర్యాన్ని, ఆమె చొరవను చూసిన అయ్యప్ప స్వాములు కూడా ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా దీక్ష చేసుకుంటామని ఆమెకు మాట ఇచ్చారు. అప్పటి నుంచి ప్రతిరోజూ ఉదయం మసీదులో ఆజాన్ మొదలైన వెంటనే పాటలు, భజనలు ఆపేసేవాళ్లు ఈ స్వాములు. ఆజాన్ పూర్తయిన వెంటనే తిరిగి తమ పాటలు, భజనలు ప్రారంభించేవాళ్లు. అక్కడి నుంచి ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా, అయ్యప్ప స్వామి దీక్షకు భగ్నం లేకుండా, తమ పూజలు, పాటలు, భజనలు యధావిధిగా కొనసాగించారు.

హిందూ, ముస్లింల ఐక్యతకు హైదరాబాద్ ఎంతోకాలంగా నిదర్శనంగా నిలుస్తోంది. ఇప్పుడు ఈ స్వాములు, వీరికి ఇల్లు ఇచ్చిన ఖాదర్ ఉన్నీసా, సహకరించిన ఈ కాలనీవాసులు కూడా పరమత సహనానికి మరో ఉదాహరణగా మారారు.
గత 20 ఏళ్లకు పైగా ఈ కాలనీలో ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు అంతా కలసిమెలసి ఉంటున్నామని ఈ కాలనీవాసులు చెప్పారు. అన్ని మతాలూ ఒక్కటేనని.. అందుకే తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే అయ్యప్ప స్వాములు పీఠం పెట్టుకోవడానికి, పూజలు చేసకోవడానికి అంగీకరించానని, వారికి తనవంతు సహాయం చేశానని ఖాదర్ ఉన్నీసా ప్రైమ్9న్యూస్‌తో చెప్పారు.

అయ్యప్ప స్వామికీ, ఇస్లాంకూ అవినాభావ సంబంధం..

వాస్తవానికి అయ్యప్ప స్వామికీ, ఇస్లాంకూ ఉన్న అవినాభావ సంబంధం మామూలు సంబంధం కాదు.
నల్లని వస్త్రాలు ధరించి నియమ నిష్ఠలతో దీక్ష చేసి, కఠినమైన శబరిమల మార్గంలో అయ్యప్ప దర్శనానికి వెళ్లే స్వాములంతా ముందుగా.. తప్పనిసరిగా వావర్ మసీదుకు వెళ్లి, అక్కడ వావర్ స్వామిని దర్శించుకుంటారు.
వావర్ స్వామిని, అయ్యప్ప స్వామిని కీర్తిస్తూ అక్కడ పాటలు పాడుతూ, భజనలు చేస్తూ.. మసీదులో ఇచ్చే ప్రసాదాలను స్వీకరిస్తారు.

500 ఏళ్లకు పైగా అయ్యప్ప స్వాములు ఈ మసీదుకు వచ్చిన తర్వాతే కొండపైకి చేరుకుంటుంటారు.
ఇలా.. అయ్యప్ప స్వామికీ, ఇస్లాంకూ ఉన్న సంబంధం గురించి తెలియకపోయినా కూడా ఖాదర్ ఉన్నీసా తన ఇంట్లో అయ్యప్ప స్వాములు పీఠం పెట్టుకునేందుకు, తన ఇంటిని అయ్యప్ప పూజా మందిరంగా మార్చుకునేందుకు అనుమతి ఇచ్చారు.

ఈ స్వాములు 41 రోజుల పూజలు పూర్తి చేసుకుని ఇప్పుడు ఇరుముడి ధరించి శబరిమల వెళ్తున్నారు.
హిందూ, ముస్లింల ఐక్యతకు, పరమత సహనానికీ వీళ్లు నిదర్శనంగా నిలిచారు.

Exit mobile version