Pocharam Wildlife: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. పర్యాటక రంగంలో ప్రపంచానికే తెలంగాణ తలమానికంగా నిలుస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడాలు.. దేవతలు, ఆకుపచ్చని అరణ్యాలకు తెలంగాణ నెలవు. తెలంగాణలో చూడాల్సిన ప్రదేశాలు అనేకం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. పర్యాటక రంగంలో ప్రపంచానికే తెలంగాణ తలమానికంగా నిలుస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడాలు.. దేవతలు, ఆకుపచ్చని అరణ్యాలకు తెలంగాణ నెలవు. తెలంగాణలో చూడాల్సిన ప్రదేశాలు అనేకం.
ప్రస్తుతం ప్రతి ఒక్కరిది ఉరుకుల పరుగుల జీవితం. ఉద్యోగం, పని, కుటుంబం ఇవే. దీని నుంచి కాస్త ఉపశమనం పొందాలనుకునేవారికి ఓ మంచి పర్యాటక కేంద్రం.. అందుబాటులో ఉంది. ఎక్కువ దూరం కాకుండా.. తక్కువ సమయంలో ప్రకృతి అందాలను అందిస్తుంది పోచారం వైల్డ్ లైఫ్. ఇక్కడ ఎటు చూసిన.. పచ్చటి చెట్లు.. పక్షుల కిలకిలారావాలు.. పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ప్రకృతి సోయగాలు.. స్వచ్ఛమైన గాలులు ఇక్కడి ప్రత్యేకత.
ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు.. మెదక్ అటవీ శాఖ, యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ పర్యాటకులకు మంచి ఆఫర్ అందిస్తున్నాయి.
‘కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం’నేచర్ క్యాంప్‌లను అందుబాటులోకి తెచ్చాయి.
నర్సాపూర్ అటవీ ప్రాంతం, పోచారం వైల్డ్‌లైఫ్ శాంక్చురీ, జీప్ సఫారీ, ట్రెక్కింగ్ తదితరాలతో రెండు పగళ్లు, ఒక రాత్రి కలిపి మొత్తం 36 గంటలపాటు అడవిలో గడుపుతూ మధుర అనుభూతులను సొంతం చేసుకొనేలా ప్యాకేజీని సిద్ధం చేశాయి.
ఈ ప్యాకేజీలో పర్యాటకులకు అడవుల్లోని చెట్లు, జంతువుల రకాలు, గిరిజనుల సాంస్కృతిక జీవనాన్ని ప్రత్యక్షంగా చూపిస్తారు.
దీంతోపాటు.. పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యత గురించి అవగాహన కల్పిస్తారు.
ఉదయం 6 గంటలకు నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కు నుంచి ప్రారంభం
ట్రెక్కింగ్, బర్డింగ్, బట్టర్‌ఫ్లై వాక్, వెట్‌ల్యాండ్ విజిట్. ఆ తర్వాత వాచ్‌టవర్ వద్ద అల్పాహారం అందిస్తారు. ఇక్కడే ఈ టూర్ కి సంబంధించిన వివరాలు చెబుతారు.
నర్సాపూర్ పార్క్ అటవీప్రాంతం సందర్శన అవ్వగానే నర్సాపూర్ పట్టణానికి పయనం. ఇక్కడ స్థానిక పర్యావరణ వ్యవస్థలపై అవగాహన.
వైల్డ్‌లైఫ్ సఫారీ, పోచారం డ్యామ్, నిజాం హెరిటేజ్ బిల్డింగ్స్ సందర్శన, సూర్యాస్తమయ వీక్షణ.
మరుసటి రోజు ఉదయం 6 గంటలకు పోచారం లేక్ వద్ద సూర్యోదయ వీక్షణ.
హైదరాబాద్‌కు 115 కి.మీ. దూరంలోని పోచారం వైల్డ్‌లైఫ్ శాంక్చురీ 130 చ.కి.మీ. విస్తీర్ణంలో మెదక్, కామారెడ్డి జిల్లాల పరిధిలో విస్తరించింది.
ఇది పోచారం లేక్ వెంట విస్తరించి ఉండటం విశేషం. ఇక్కడ వివిధ రకాల జింకలు, చిరుతలు, ఎలుగుబంట్లు కూడా కనిపిస్తుంటాయి. పలు రకాల అరుదైన పక్షులకు సైతం ఇది కేంద్రంగా ఉంది.
పర్యాటకులకు ప్రత్యక్షంగా ప్రకృతిని, వైల్డ్ లైఫ్‌ను అనుభవంలోకి తీసుకొచ్చేందుకు ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించారు.
కనీసం 20 మందితో కూడిన పర్యాటక బృందం ఈ క్యాంప్‌కు రావాల్సి ఉంటుంది. సొంత వాహనాల్లోనే వారు మొత్తం టూర్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.