Telangana Weather: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఇన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన ప్రజలకు వర్షాలతో ఉపశమనం లభించింది. కాగా నిన్న కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 8.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 8.38, యాదాద్రి భువనగిరి 6.55, హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో 4.18, హిమాయత్ నగర్ లో 3.65 సెంటీమీటర్ల వర్షం పడింది.
అయితే రానున్న ఐదురోజుల్లో తెలంగాణలో మరిన్ని భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ చెప్పింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ముఖ్యంగా భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, నిజామాబాద్
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వర్షంతోపాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు సహా.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.