Priyanka Gandhi: తెలంగాణలో అమరుల ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయో ఆలోచించి ఓటు వేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా పాలకుర్తిలో జరిగిన బహిరంగసభలో ఆమె ప్రసంగించారు.
ప్రస్తుతం తెలంగాణలో త్యాగం చేసినవాళ్లు ఒకవైపు, దోపిడి చేసిన వాళ్లు మరోవైపు ఉన్నారని ప్రియాంక అన్నారు. మీ త్యాగాలు, బలిదానాలతో తెలంగాణ ఏర్పడింది.ఈ రాష్ట్రం పురోగతి చెందాలంటే మీ ఓటు విలువైనది.పదేళ్లలో ఎంతమందికి ఉపాధి వచ్చింది? రాష్ట్రంలో పరీక్ష పేపర్లు లీక్ అవుతున్నాయి.పేపర్ లీకులతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు.ఓటు వేసే ముందు నిజాయితీపరులు ఎవరనేది ఆలోచించాలని ప్రియాంక కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ తీసుకొస్తామన్నారు. మండలానికి ఓ ఇంటర్నేషనల్ స్కూల్ నెలకొల్పుతామని చెప్పారు. ధరల పెరుగుదలతో పేదల జీవితాలు కష్టాలపాలవుతున్నాయని అన్నారు. మహిళలకు ప్రతీనెలా 2,500 ఆర్థిక సాయం చేస్తామని గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే ఇస్తామని చెప్పారు.మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్న ప్రియాంక వారి అప్పులు మాఫీ చేస్తామని చెప్పారు. పెట్టుబడి సాయం కింద రైతులకు రూ.15 వేలు,వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామన్నారు. మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలన్నారు.
అదేవిధంగా హుస్నాబాద్‌లో ప్రియాంక మాట్లాడుతూ నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందన్నారు. తెలంగాణలో మహిళలకు భద్రత లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని ప్రియాంక ఆరోపించారు.ఇతర రాష్ట్రాల్లోనూ బీజేపీ విజయానికి ఎంఐఎం సహకరిస్తోందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసారా? కేసీఆర్ దత్తత తీసుకున్న ముల్కనూరులో అభివృద్ది జరిగిందా అంటూ ప్రియాంక ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్,కేంద్రంలో బీఆర్ఎస్ సంపన్నులకే లబ్దకలిగేలా వ్యవహరిస్తున్నాయని ప్రియాంక తీవ్రంగా విమర్శించారు.