GT vs CSK Final: గుజరాత్ వర్సెస్ చెన్నై.. ఫైనల్లో ఈ రికార్డులు బ్రేక్ అవుతాయా?

GT vs CSK Final: ఐపీఎల్ చివరి అంకానికి తెరలేవనుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.

GT vs CSK Final: ఐపీఎల్ చివరి అంకానికి తెరలేవనుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడిన చెన్నై, గుజరాత్ జట్లే.. చివరి మ్యాచ్ ఆడుతున్నాయి. ఇక ఐదోసారి చెన్నై కప్ గెలుస్తుందా.. లేదా గుజరాత్ రెండోసారి ట్రోఫిని ముద్దాడుతుందా అనే వేచి చూడాలి. ఇక ఈ చివరి మ్యాచ్ లో పలు రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది. అవెంటో ఓసారి చూద్దాం.

గిల్ రికార్డు బద్దలు కొడతాడా? (GT vs CSK Final)

ఈ సీజన్ లో గిల్ అద్భుత ఫామ్ తో ప్రత్యర్ధి జట్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ సీజన్ లో ఏకంగా మూడు సెంచరీలతో చెలరేగాడు. ప్రస్తుతం 851 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. అయితే ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాలంటే గిల్‌ సరిగ్గా 122 పరుగులు చేయాలి. ఈ పరుగులు ఫైనల్ చేస్తే.. కోహ్లీ రికార్డును అధిగమిస్తాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 2016లో 973 పరుగులతో మెుదటి స్థానంలో ఉన్నాడు.

బౌలర్ల రికార్డు

ఈ సీజన్ లో ఒకే జట్టు నుంచి ముగ్గురు పర్పుల్‌ క్యాప్‌ రేసులో నిలవడం విశేషం. మహమ్మద్ షమీ (28 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత రషీద్ ఖాన్ (27 వికెట్లు), మోహిత్ శర్మ (24 వికెట్లు) ఉన్నారు. ఈ మ్యాచ్ లో గనక.. రషీద్ ఒక్క వికెట్‌, మోహిత్ నాలుగు వికెట్లు తీస్తే ముగ్గురు బౌలర్లు 28 వికెట్లతో ఉంటారు. ఇలా ఒకే సీజన్‌లో ఒకే జట్టు నుంచి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు ఉండటం కూడా ఓ రికార్డే.

ఇప్పటివరకు సీఎస్ కే నాలుగుసార్లు కప్ గెలిచింది. ఈ సీజన్ గెలిస్తే ఐదోసారి కప్ గెలిచిన జట్టుగా చెన్నై నిలుస్తుంది.

దీంతో ముంబయి రికార్డును సమం చేస్తుంది. ఇప్పటివరకు వరుసగా రెండుసార్లు కప్ గెలిచిన జట్టుగా చెన్నై నిలిచింది.

ఇప్పుడు ఆ అవకాశం గుజరాత్ టైటాన్స్‌కు వచ్చింది. గతేడాది అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్‌ తొలి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.

ఇప్పుడు ఫైనల్‌కు చేరడంతో రెండో సారి విజేతగా నిలిచి చెన్నై సరసన చేరుతుందో లేదో మరి.

ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ టైటిల్‌ను గెలిస్తే ఐపీఎల్‌ చరిత్రలో మరో అద్భుతమైన రికార్డుగా మిగిలిపోతుంది.

మరీ ముఖ్యంగా ధోనీ పేరిట అరుదైన ఘనత నమోదవుతుంది.

అత్యధిక వయసులో ఐపీఎల్‌ టైటిల్‌ను నెగ్గిన జట్టు సారథిగా ధోనీ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ధోనీ వయసు 41 ఏళ్లు.
రుతురాజ్ గైక్వాడ్ మరో 36 పరుగులు చేస్తే ఈ సీజన్‌లో 600 రన్స్‌ చేసిన బ్యాటర్‌గా మారతాడు.

ఇందులో ప్రత్యేకత ఏముందంటారా..? రుతురాజ్‌ 600+ పరుగులు చేసి చెన్నై విజేతగా నిలిస్తే మాత్రం అదీ ఓ రికార్డు అవుతుంది.

చెన్నై 2021 సీజన్ విజేతగా నిలిచినప్పుడు కూడా రుతురాజ్‌ 635 పరుగులు చేశాడు.

ఇలా సీఎస్‌కే కప్‌ను సొంతం చేసుకున్నప్పుడు రెండుసార్లు 600కిపైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డును ఖాతాలో వేసుకుంటాడు.