Ipl 2023 : ఐపీఎల్ 2023 సీజన్ చివరికి వచ్చేసింది. ఇప్పటికే లీగ్ దశలో మ్యాచ్‌లు అన్నీ పూర్తి అయ్యి.. ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు నేటి నుంచి జరగనున్నాయి. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు.. వరుసగా టాప్ 4 లో ఉన్నాయి. కాగా పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఈరోజు (మే 23, 2023 ) రాత్రి 7:30 గంటలకి చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టుకి సెకండ్ ఛాన్స్ ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన వారితో క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో మళ్ళీ ఆడే అవకాశం ఉంది.
ఇక నేటి మ్యాచ్ లో తలపడనున్న గుజరాత్ , చెన్నై పాయింట్ల పట్టికలో టాప్-2 ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ జట్లు ఐపీఎల్‌లో మూడు సార్లు తలపడ్డాయి. ఈ మూడింటిలోనూ గుజరాత్ టైటాన్స్ గెలుపొందడం గమనార్హం. ఈ సీజన్‌లో ఇప్పటికే చెన్నై, గుజరాత్ జట్లు మధ్య ఒకసారి మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని 19.2 ఓవర్లలోనే గుజరాత్ టైటాన్స్ ఛేదించేసింది. మొత్తానికి లీగ్ దశలో 14 మ్యాచ్‌లాడిన గుజరాత్ 10 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. చెన్నై 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఇరు జట్లు బలంగా ఉన్నాయి. చెన్నై కి ధోనీ సారధ్యం వహిస్తుండగా.. గుజరాత్ కి హార్ధిక్ పాండ్య కెప్టెన్ గా చేస్తున్నాడు.
ఈ మ్యాచ్ లో మెయిన్ అట్రాక్షన్ గా గిల్ (Ipl 2023)..
గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న శుభ్‌మన్ గిల్ ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు 14 మ్యాచ్ లు ఆడి 680 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 152.46 స్టైక్ రేటు, 56.67 సగటుతో 67 ఫోర్లు, 22 సిక్సర్లు బాదాడు గిల్. ఈ సీజన్ లో అత్యధిక స్కోర్ చేసిన వారిలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ ఫాఫ్ డూ ప్లెసిస్ గిల్ కంటే ముందున్నాడు. 730 పరుగులతో అతడు ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. దీంతో శుభ్‌మన్ గిల్ ఈరోజు మ్యాచ్ లో రాణిస్తే ఆరెంజ్ క్యాప్ సాధించే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు.
ఎలిమినేటర్ మ్యాచ్.. మే 24 బుధవారం లక్నోసూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు రెండో క్వాలిఫయర్ ఆడనుండగా ఓడిన జట్టు ఇంటి ముఖం పడుతుంది. ఈ మ్యాచ్‌కు కూడా చెన్నైలోని చెపాక్ స్టేడియమే అతిథ్యం ఇవ్వనుంది.
క్వాలిఫైయర్ 2.. మే 26 శుక్రవారం క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్‌లో గెలిచిన జట్లు మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో విజయం సాధించిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్ గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
పైనల్ : మే 28 ఆదివారం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తొలి క్వాలిపైయర్‌లో గెలిచిన జట్టు, రెండో క్వాలిఫైయర్‌లో విజయం సాధించిన జట్టుకు మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కూడా గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరుగుతుంది.