SRH vs MI : హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్ ఆల్ రౌండ్ షో తో హ్యాట్రిక్ విక్టరీ సాధించింది. ముంబై ఇచ్చిన 193 పరుగుల టార్గెట్ ని ఛేధించడంలో సన్ రైజర్స్ తడబడ్డారు. 178 పరుగులకే హైదరాబాద్ జట్టు ఆలౌట్ కావడంతో ముంబై జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ లో విజయం సాధిస్తుందని భావించిన అభిమానులందరికి నిరాశ మిగిలింది.
ఛేజింగ్ లో తడబడ్డ సన్ రైజర్స్ SRH vs MI ..
కాగా లక్ష్య ఛేదనలో హైదరాబాద్ ఓపెనర్స్ ఇద్దరు తక్కువ స్కోర్ లకే పెవిలియన్ బాటపట్టడం పెద్ద మైనస్ అని చెప్పాలి. ఓపెనర్ హారీ బ్రూక్ (9) మొదట్లోనే ఔట్ అవ్వగా.. అనంతరం వచ్చిన రాహుల్ త్రిపాఠి (7) కూడా సింగిల్ డిజిట్‌కే వికెట్ చేజార్చుకున్నాడు. అయితే కెప్టెన్ ఆడెన్ మర్‌క్రమ్ (22: 17 బంతుల్లో 1×4, 1×6)తో కలిసి ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (48: 41 బంతుల్లో 4×4, 1×6) మంచి ఇన్నింగ్స్ నెలకొల్పాడు. దీంతో హైదరాబాద్ లో విజయం సాధిస్తామనే నమ్మకం వచ్చింది.. కానీ అంతలోనే వీరిద్దరూ వికెట్లు చేజార్చుకోవడం.. ఆ తర్వాత వచ్చిన అభిషేక్ శర్మ (1) కూడా ఔటైపోవడడంతో అందరి ఆశలు ఆవిరైపోయాయి. ఇక చివర్లో హెన్రిచ్ క్లాసెన్ (36: 16 బంతుల్లో 4×4, 2×6) స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించినా.. అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది. ఇక ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ (10), మార్కో జాన్‌సెన్ (13), అబ్దుల్ సమద్ (9), భువనేశ్వర్ కుమార్ (2) వరుసగా వికెట్లు కోల్పోవడంతో సన్ రైజర్స్ ఆలౌట్ అయ్యారు. ఇక ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా, రిలే మెరాడిత్, బెరండ్రాఫ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. అర్జున్ టెండూల్కర్ ఒక వికెట్ తీశాడు.
ఇక ఈ మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌తో ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ లాస్ట్ ఓవర్ వేయించాడు. ఓవర్ లో ఐదో బంతికి ఆఖరి వికెట్ రూపంలో భువనేశ్వర్ కుమార్‌ని ఔట్ చేశాడు. కెరీర్‌లో రెండో ఐపీఎల్ మ్యాచ్ ఆడిన అర్జున్‌కి ఇదే మొదటి వికెట్ కావడం విశేషం.
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ(28), ఇషాన్ కిషన్(38)లు శుభారంభం ఇచ్చారు. వాషింగ్టన్ సుందర్ వేసిన మూడో ఓవర్‌లో రోహిత్ శర్మ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి ఐపీఎల్‌లో 6 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ధాటిగా ఆడే క్రమంలో నటరాజన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన రోహిత్.. మార్‌క్రమ్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. దీంతో ముంబై జట్టు 41 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. క్రీజులో కుదురుకున్న ఇషాన్ కిషన్‌కు కామెరూన్ గ్రీన్(64 నాటౌట్; 40 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్సర్లు) జత కలిశాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 46 పరుగులు జోడించారు.
మెరుపులు మెరిపించిన గ్రీన్, తిలక్ వర్మ..
కానీ మార్కో జాన్సెన్.. ఇషాన్ కిషన్‌తో పాటు సూర్యకుమార్(6) యాదవ్‌ను ఒకే ఓవర్‌లో పెవిలియన్‌కు పంపాడు. దీంతో 95 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ముంబై కష్టాల్లో పడింది. అయితే.. గ్రీన్‌కు మన హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ (37; 17 బంతుల్లో 2 ఫోర్లు, 4సిక్సర్లు) తోడవ్వడంతో.. సన్ రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. తిలక్ ఉన్నంత సేపు బౌండరీల మోత మోగించాడు. నాలుగో వికెట్ కు 56 పరుగులు జోడించాక జట్టు స్కోరు 151 వద్ద తిలక్ వర్మ ను భువనేశ్వర్ ఔట్ చేశాడు. ఇక ధాటిగా ఆడిన కామెరూన్ గ్రీన్ 33 బంతుల్లోనే ఐపీఎల్‌లో తొలి అర్ధశతకాన్ని సాధించాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు వికెట్లు తీయగా, నటరాజన్, భువనేశ్వర్ ఒక్కొ వికెట్ పడగొట్టారు.