Sanju Samson: ఐపీఎల్ 2023లో భాగంగా జైపూర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో రాజస్థాన్ తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో 32 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించింది. దీంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో రాజస్తాన్ టాప్ ప్లేస్ లోకి దూసుకువెళ్లింది. కాగా, మ్యాచ్ విజయంపై ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ రియాక్ట్ అయ్యాడు. జైపూర్‌లో తమ తొలి విజయం సాధించినందుకు చాలా హ్యాపీగా ఉందని సంజూ తెలిపాడు.
యంగ్ స్టర్స్ అద్భుత ప్రదర్శనతో(Sanju Samson)
‘ చెన్నై సూపర్ కింగ్స్ తో విజయం మా టీమ్ లో మరింత ఊత్సహాన్ని నింపింది. ఎందుకంటే మేము రెండు మ్యాచ్‌ల్లో వరుసగా ఓడి ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాం. అదే విధంగా జైపూర్‌లో మా మొదటి విజయం సాధించినందుకు ఇంకా సంతోషంగా ఉంది. గత రెండు రోజులుగా ఇక్కడ ప్రాక్టీస్ చేశాం. జైపూర్ గ్రౌండ్ పరిస్థితులకు తగ్గట్టుగానే ముందు బ్యాటింగ్ తీసుకున్నాం. అయితే, వాంఖడే స్టేడియం గానీ, చిన్నస్వామి స్టేడియం గానీ అయి ఉంటే నేను మొదట బౌలింగ్ తీసుకునే వాడిని. ఇకపోతే మా బ్యాటింగ్ ఆర్డర్ లో యంగ్ స్టర్స్ అద్భుత ప్రదర్శన కనబర్చారు. వాళ్లకు అలాంటి ఫ్రీడమ్ ఇచ్చిన జట్టు మేనెజ్‌మెంట్, సపోర్ట్ స్టాఫ్‌కు ఈ క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నా. మరోవైపు జైశ్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. జైస్వాల్ మా జట్టుకు దొరికిన విలువైన ఆస్తి. ప్రతీ సీజన్‌లో తానేంటో నిరూపించుకుంటున్నాడు’ అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో శాంసన్ తెలిపాడు.
చేతులెత్తేసిన చెన్నై
కాగా, ఐపీఎల్‌లో భాగంగా జైపూర్ వేదికగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ఈ పోరులో చెన్నై వరుస విజయాలకు బ్రేక్ వేస్తూ రాజస్థాన్ సూపర్ విక్టరీ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ ఇచ్చిన 203 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో చెన్నై చేతులెత్తేసింది. టార్గెట్ ని ఛేజ్ చేసే క్రమంలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులకే పరిమితమవ్వడంతో రాజస్థాన్ 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక చెన్నై బ్యాటర్లలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (47; 29 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) మంచి స్టార్ట్ ఇచ్చినా.. మరో ఓపెనర్ దేవాన్ కాన్వె (8) ఈ మ్యాచ్ లో విఫలమయ్యాడు.