Mohammed Shami: క్రికెటర్ మహమ్మద్ షమీకి చాలా మందితో అఫైర్స్.. భార్య సంచలన ఆరోపణలు

రత స్టార్ క్రికెటర్ , పేసర్ మహమ్మద్ షమీ పై అతని భార్య హసీన్ జహాన్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది.

Mohammed Shami: భారత స్టార్ క్రికెటర్ , పేసర్ మహమ్మద్ షమీ పై అతని భార్య హసీన్ జహాన్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. కట్నం కోసం షమీ తనని వేధించేవాడని, అతనికి ఇప్పటికీ వివాహేతర సంబంధాలున్నాయని ఆరోపించింది. అంతేకాకుండా షమీపై నమోదు అయిన క్రిమినల్ కేసు విచారణలో గత నాలుగేళ్లుగా ఎలాంటి పురోగతి లేదని.. తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. షమీ అరెస్ట్ వారెంట్ పై ఉన్న స్టేను ఎత్తివేయాలని కోరుతూ ఆమె స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేసింది. 2014 లో హసీన్‌ జహాన్‌ను షమీ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె ఉంది. కానీ, గత కొంత కాలంలో ఆమె.. షమీకి దూరంగా ఉంటున్నారు.

 

2018 లో గృహహింస కేసు(Mohammed Shami)

కాగా, మహమ్మద్ తనపై గృహ హింసకు పాల్పడుతున్నాడని 2018 లో హసీన్ కోల్ కతాలోని జాదవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. ఈ క్రమంలో అప్పట్లో కోల్ కతా పోలీసు మహిళా పోలీస్ డిపార్ట్ మెంట్ షమీతో పాటు అతడి సోదరుడిని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో 2019 ఆగష్టులో షమీపై అరెస్టు వారెంట్ జారీ చేస్తూ కోల్ కతాలోని అలిపోర్ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ షమీ సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. క్రిమినల్ కేసు విచారణ, అరెస్టు వారెంట్ పై స్టే విధిస్తూ సెషన్స్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

 

అయితే, హసీన్ 2023, మార్చిలో కోల్ కతా హైకోర్టును ఆశ్రయించింది. షమీ అరెస్టు వారెంట్ పై స్టే ఎత్తి వేయాలని పిటిషన్ దాఖలు చేసింది. కానీ అందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆమె హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ తాజాగా సుప్రీం కోర్టుకు వెళ్లింది. తన భర్తపై కేసు నమోదు అయినా.. కావాలనే గత నాలుగేళ్లుగా విచారణపై స్టే కొనసాగిస్తున్నారని ఆమె పిటిషన్ లో పేర్కొంది. ఈ సందర్భంగానే హసీన్.. షమీపై తీవ్ర ఆరోపణలు చేసింది. ‘షమీ తరచూ కట్నం కోసం వేధించేవాడు. అతనికి ఎంతో మందితో వివాహేతర సంబంధాలున్నాయి. జాతీయ క్రికెట్ జట్టుతో కలిసి టూర్స్ కు వెళ్లినపుడు ఇప్పటికీ అతను ఆ సంబంధాలను కొనసాగిస్తున్నాడు’ అని తెలిపింది.

 

నెలకు రూ. 1.30 లక్షల భరణం

షమీపై గృహహింస కేసు పెట్టినపుడు.. తమ ఖర్చుల కోసం భరణం కింద నెలకు రూ.10 లక్షలు ఇవ్వాలని హసీన్ కోర్టులో కేసు వేసింది. ఇందులో రూ. 7 లక్షలు తన ఖర్చుల కోసం, మిగతా రూ. 3 లక్షలు కూతురి కోసమని పేర్కొంది. దీనిపై కోల్‌కతా హైకోర్టు గతంలో విచారణ జరిపి హసీన్‌కు నెలకు రూ. 1.30 లక్షల భరణం చెల్లించాలని షమీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రూ. 50 వేలు హసీన్ ఖర్చుల నిమిత్తం.. మిగతా 80 వేలు వారి కుమార్తె పోషణ కోసం ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై కూడా అప్పట్లో హసీన్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది.