Site icon Prime9

SRH vs DC : చేజేతులా ఢిల్లీ పై ఘోర పరాజయం పాలైన సన్ రైజర్స్.. స్వల్ప లక్ష్యాన్ని ఛేధించలేక చేతులెత్తేసిన వైనం

SRH vs DC match highlights in ipl 2023

SRH vs DC match highlights in ipl 2023

SRH vs DC : ఐపీఎల్ 2023లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఘోర పరాజయం పాలైంది.  ఢిల్లీ నిర్దేశించిన 145 పరుగులు స్వల్ప లక్ష్యాన్ని ఛేధించలేక నిర్ణీత ఓవర్లలో 137 పరుగులు మాత్రమే చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్‌ రైజర్స్‌లోని టాప్ ప్లేయర్స్ అంతా చేతులెత్తేసిన మయంక అగర్వాల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసినప్పటికీ ఓటమి తప్పలేదు. టార్గెట్ చిన్నదే అయినా సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్ అంతా  స్కోర్ చేయడం కంటే ఎక్కువగా పెవిలియన్ బాట పట్టడానికే ఎక్కువ మక్కువ చూపినట్లు కనబడుతుంది.

హైదరాబాద్ జట్టులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (49: 39 బంతుల్లో 7×4) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. కానీ అతని ఒంటరి పోరాటానికి మిగతా సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్ సపోర్ట్ అందించలేకపోయారు. మిగిలిన బ్యాటర్లలో హారీ బ్రూక్ (7), రాహుల్ త్రిపాఠి (15), అభిషేక్ శర్మ (5) వరుసగా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కి బాట పట్టారు. కెప్టెన్ మార్ర్కమ్ కూడా 3 పరుగులకే జెండా ఎత్తేశాడు. ఇక 30 బంతుల్లో 56 పరుగులు అవసరం అవ్వగా ఈ దశలో హెన్రిచ్ క్లాసెన్ (31: 19 బంతుల్లో 3×4, 1×6), వాషింగ్టన్ సుందర్ (24 నాటౌట్: 15 బంతుల్లో 3×4) కాస్త దూకుడుగా ఆడి హైదరాబాద్ టీమ్‌లో గెలుపు ఆశలు రేపారు. కానీ హెన్రిచ్ ఔట్ తర్వాత సుందర్ ధాటిగా బ్యాటింగ్ చేయడంలో ఫెయిల్ అవ్వడంతో ఢిల్లీ గెలుపు లాంఛనం అయ్యింది. ముఖ్యంగా చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరం అవగా.. కేవలం 5 పరుగుల్నే సన్‌రైజర్స్ రాబట్టగలిగింది. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జే, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీయగా.. ఇశాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.

 

అంతకముందు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. వీరిలో మనీశ్ పాండే (34: 27 బంతుల్లో 2×4), అక్షర్ పటేల్ (34: 34 బంతుల్లో 4×4) ఫర్వాలేదనిపించారు. కానీ సాల్ట్ (0), మిచెల్ మార్ష్ (25: 15 బంతుల్లో 5×4) , డేవిడ్ వార్నర్ (21: 20 బంతుల్లో 2×4, 1×6), సర్ఫరాజ్ ఖాన్ (10), అమన్ హసీమ్ ఖాన్ (4) తక్కువ స్కోర్లకే వికెట్లు చేజార్చుకోవడంతో ఢిల్లీ తక్కువ స్కోర్ కే పరిమితం అయ్యింది. సన్‌రైజర్స్ బౌలర్లలో సుందర్ మూడు, భువనేశ్వర్ రెండు, టి.నటరాజన్ ఒక వికెట్ పడగొట్టారు.

కాగా ఈ సీజన్ లో ఉప్పల్ వేదికగా జరిగిన ఇది 4వ మ్యాచ్ కావడం విశేషం. హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్ లో ఆడిన 4 మ్యాచుల్లో కేవలం ఒక మ్యాచ్ లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. అలాగే ఈ సీజన్ లో ఇప్పటివరకు హైదరాబాద్ మొత్తం  7 మ్యాచులు ఆడగా రెండింట్లో మాత్రమే గెలుపొందింది. మరోవైపు ఢిల్లీ 7 మ్యాచులు ఆడగా రెండింటిలో విజయం సాధించింది. పాయింట్ల టేబుల్ లో హైదరాబాద్ 9, ఢిల్లీ 10 వ స్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్ ఓటమితో అభిమానులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు.

Exit mobile version
Skip to toolbar