MI Vs RCB : ఐపీఎల్ 2023 లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. 200 పరుగుల భారీ లక్ష్యాన్ని 16.3 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి చేధించి ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 35 బంతుల్లోనే 83 పరుగులు చేయగా అందులో 7 ఫోర్లు, 6 సిక్సులు బాదడం గమనార్హం. సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో లక్ష్యాన్ని 16.3 ఓవర్లలోనే ముంబై ఇండియన్స్ ఛేదించేసింది. సీజన్‌లో 11వ మ్యాచ్ ఆడిన ముంబయి టీమ్‌కి ఇది ఆరో గెలుపు కాగా.. దీంతో పాయింట్ల పట్టిక లోనూ 8వ స్థానం నుంచి మూడుకి ఎగబాకింది. మరోవైపు 11వ మ్యాచ్ ఆడిన బెంగళూరుకి ఇది ఆరో ఓటమి.
లక్ష్యఛేదనలో ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ (7) నిరాశపరిచాడు. కానీ.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (42: 21 బంతుల్లో 4×4, 4×6) పవర్ ప్లేలో దూకుడుగా ఆడేశాడు. దాంతో తొలి వికెట్‌కి 4.4 ఓవర్లలోనే 51 పరుగుల భాగస్వామ్యం ముంబయికి లభించింది. కానీ.. ఓపెనర్లు ఇద్దరూ పరుగు వ్యవధిలోనే పెవిలియన్‌కి చేరిపోయారు. కానీ.. నెం.3లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఒక్కసారిగా ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతనికి నేహాల్ వధీర (52 నాటౌట్: 34 బంతుల్లో 4×4, 3×6) చక్కటి సపోర్ట్ లభించింది. దాంతో ఈ జంట మూడో వికెట్‌కి 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఆర్సీబీ బౌలర్లో హసరంగ, వైశాక్ చెరో రెండు వికెట్లు తీశారు.
Manla re bhau 🫡#OneFamily #MIvRCB #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 @surya_14kumar pic.twitter.com/LIOVusW6rF
— Mumbai Indians (@mipaltan) May 9, 2023
ఇక టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ (MI Vs RCB) లో కోహ్లీ కేవలం 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరడం బెంగుళూరు ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకి గురి చేసింది. కాగా 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో మాక్స్‌వెల్ (68: 33 బంతుల్లో 8×4, 4×6), కెప్టెన్ డుప్లెసిస్ (65: 41 బంతుల్లో 5×4, 3×6) హాఫ్ సెంచరీలు బాదేశారు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కి 120 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక చివర్లో 18 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్ బెంగుళూరు భారీ స్కోర్ చేయడానికి బాగా హెల్ప్ చేశాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో బెరండ్రాఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. కామెరూన్ గ్రీన్, కుమార్ కార్తికేయ, క్రిస్ జోర్దాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.