Site icon Prime9

DC vs PBKS : ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ ని చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్.. శ‌త‌క్కొట్టిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్.. ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవం

DC vs PBKS match highlights in ipl 2023

DC vs PBKS match highlights in ipl 2023

DC vs PBKS : ఐపీఎల్ 2023 లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ తో పంజాబ్ కింగ్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఇచ్చిన టార్గెట్ ని చేధించే క్రమంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 136 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది. దీంతో 31 ప‌రుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘ‌న విజ‌యం సాధించింది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో డేవిడ్ వార్న‌ర్ (54; 27 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచరీతో అలరించగా ఫిలిఫ్ సాల్ట్ (21) ఫ‌ర్వాలేద‌నిపించాడు. కానీ మిగతా బ్యాటర్లు అంతా ఘోరంగా విఫలం అయ్యారు.  మిచెల్ మార్ష్‌(3), రిలీ రొసో(5), అక్ష‌ర్ ప‌టేల్‌(1), మ‌నీశ్ పాండే(0)లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టడం ఢిల్లీ ఓటమికి కారణం అయ్యింది. పంజాబ్ బౌల‌ర్ల‌లో హర్‌ప్రీత్ బ్రార్ నాలుగు వికెట్లు తీయ‌గా, రాహుల్ చాహ‌ర్, నాథన్ ఎల్లిస్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

ఇక టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 167 ప‌రుగులు చేసింది. 61 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఐపీఎల్‌తో త‌న తొలి శ‌త‌కాన్ని న‌మోదు చేశాడు. మరో ఓపెనర్, కెప్టెన్ శిఖర్ ధావన్ (7: 5 బంతుల్లో 1×6) ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో ఔటైపోయాడు. ఆ తర్వాత వచ్చిన లియామ్ లివింగ్‌స్టోన్ (4) కూడా ఇషాంత్‌కే వికెట్ సమర్పించుకోగా.. జితేశ్ శర్మ(5) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. దాంతో పంజాబ్ టీమ్ 45/3తో ఒత్తిడిలో పడింది. కానీ ఆ తరుణంలోనే శామ్ కరన్ (20: 24 బంతుల్లో 1×4)తో కలిసి పంజాబ్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దిన ప్రభసిమ్రాన్ సింగ్.. జట్టుకి గౌరవప్రదమైన స్కోరుని అందించాడు. దాంతో 167 పరుగులతోనే పంజాబ్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో ఇషాంత్ శ‌ర్మ రెండు వికెట్లు తీయ‌గా, అక్ష‌ర్ ప‌టేల్‌, ప్ర‌వీణ్ దూబే, కుల్దీప్ యాద‌వ్‌, ముకేశ్ కుమార్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

 

 

కాగా ఈ  సీజన్ లో 12వ మ్యాచ్ ఆడిన ఢిల్లీ టీమ్‌కి ఇది 8వ ఓటమికాగా.. పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. మరోవైపు 12వ మ్యాచ్ ఆడిన పంజాబ్ కింగ్స్ టీమ్ ఆరో విజయంతో ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. అలానే పాయింట్ల పట్టికలోనూ ఆరో స్థానానికి ఎగబాకింది.

Exit mobile version