Site icon Prime9

CSK vs GT IPL Final : దుమ్మురేపిన ధోనీ సేన.. గుజరాత్ ని చిత్తు చేసి ఐదోసారి ఐపీఎల్ టైటిల్ కైవసం

CSK vs GT IPL Final match in ipl 2023 highlights

CSK vs GT IPL Final match in ipl 2023 highlights

CSK vs GT IPL Final : చెన్నై సూప‌ర్ కింగ్స్ మరోసారి దుమ్ము రేపింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య అద్బుత ప్రదర్శన ఇచ్చి ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ క్ర‌మంలో ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక టైటిళ్లు అందుకున్న‌ ముంబై ఇండియ‌న్స్ జట్టు రికార్డుని సమానం చేసింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌ తో జ‌రిగిన ఫైన‌ల్ గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 214 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ ఇన్నింగ్స్ ముగిసిన త‌రువాత చెన్నై ఇన్నింగ్స్ ప్రారంభం కాగానే 3 బంతుల్లో 4 పరుగులు చేయగానే వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. వ‌ర్షం వెలిసిన త‌రువాత డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తి అనుస‌రించి 15 ఓవ‌ర్ల‌కు చెన్నై ల‌క్ష్యాన్ని 171 ప‌రుగులుగా నిర్దేశించారు.

ఇక చెన్నై బ్యాట‌ర్ల‌లో  చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (26: 16 బంతుల్లో 3×4, 1×6), దేవాన్ కాన్వె (47: 25 బంతుల్లో 4×4, 3×6) ఫస్ట్ నుంచి దూకుడుగా ఆడేయగా తొలి వికెట్‌కి 74 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయ్యాడు. అదే ఓవర్లో భారీ షాట్ కి ప్రయత్నించి కాన్వే కూడా వికెట్ కోల్పోయాడు. అప్పటికి 7 ఓవర్లలో 78 పరుగులు చేసింది సీఎస్‌కే. ఆ తర్వాత వచ్చిన అజింక్యా ర‌హానే (27; 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), శివ‌మ్ దూబే(32 నాటౌట్; 21 బంతుల్లో 2సిక్స‌ర్లు), అంబ‌టి రాయుడు (19; 8 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స‌ర్లు) ఎవరి స్టైల్లో వాళ్ళు .. దుమ్ము రేపుతూ .. స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించారు.

అయితే.. 13వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ధోని (0) గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. దాంతో లాస్ట్‌లో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. ఆఖ‌ర్లో చెన్నై విజ‌యానికి రెండు బంతుల్లో 10 ప‌రుగులు అవ‌స‌రం కాగా.. ర‌వీంద్ర జ‌డేజా (15నాటౌట్; 6 బంతుల్లో 1 సిక్స్‌, 1 ఫోర్‌) వ‌రుస‌గా సిక్స్, ఫోర్ కొట్టి గెలిపించాడు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో మోహిత్ శ‌ర్మ మూడు వికెట్లు తీయ‌గా, నూర్ అహ్మ‌ద్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ మ్యాచ్‌తో అంబటి రాయుడు ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పేశాడు.

 

అంత‌క‌ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 214 ప‌రుగులు చేసింది. వ‌న్‌ డౌన్‌లో వ‌చ్చిన సాయి సుద‌ర్శ‌న్ (96; 47 బంతుల్లో 8ఫోర్లు, 6సిక్స‌ర్లు) చెలరేగాడు. 33 బంతుల్లో అర్ధ‌శ‌త‌కాన్ని చేసిన సుద‌ర్శ‌న్ ఆ త‌రువాత ఒక్క‌సారిగా విజృంభించాడు. తుషార్ దేశ్ పాండే వేసిన 17వ ఓవ‌ర్‌లో 6,4,4,4 బాదాడు. ఇన్నింగ్స్ చివ‌రి ఓవ‌ర్‌ను ప‌తిర‌న వేయ‌గా మొద‌టి రెండు బంతుల‌ను సిక్స్‌లుగా మలిచాడు. అయితే.. ఆ త‌రువాతి బంతికే ఎల్భీగా పెవిలియ‌న్‌కు చేరుకోవ‌డంతో శ‌త‌కం మిస్సైంది. వృద్ధిమాన్‌ సాహా (54; 39 బంతుల్లో 5ఫోర్లు, 1సిక్స్‌) అర్ధ సెంచ‌రీతో అల‌రించగా.. శుభ్‌మన్‌ గిల్‌ (39; 20 బంతుల్లో 7ఫోర్లు), ఆఖ‌ర్లో కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా(21 నాటౌట్‌; 12 బంతుల్లో 2 సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చెన్నై బౌల‌ర్ల‌లో ప‌తిర‌న రెండు వికెట్లు తీయ‌గా జ‌డేజా, దీప‌క్ చాహ‌ర్‌లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

 

Exit mobile version