Site icon Prime9

IPL 2023 : ఈరోజు నుంచి ఐపీఎల్‌ సందడి షురూ.. ఫస్ట్ మ్యాచ్ లో చెన్నై వర్సెస్ గుజరాత్

ipl 2023 season 16 going to start from today

ipl 2023 season 16 going to start from today

IPL 2023 : ఐపీఎల్‌ 16 వ సీజన్‌ నేటి నుంచి షురూ కానుంది. ఐపీఎల్ అంటే క్రికెట్ అభిమానులకు ఒకరకంగా పండగే అని చెప్పాలి. దాదాపు రెండు నెలల పాటు ఫుల్ గా అందర్నీ అలరించడంలో పక్కా అనేలా అన్ని టీమ్స్ సిద్దమవుతున్నాయి. ప్రతి రోజూ రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కొన్ని మ్యాచ్‌లు మధ్యాహ్నం మూడున్నరకు నిర్వహించనున్నారు. గత ఏడాది మాదిరిగానే మొత్తం పది జట్లు బరిలోకి దిగుతున్నాయి.

ఈరోజు నుంచి ప్రారంభమయ్యే టోర్నీ మే 21వరకు జరగనుంది. 50 రోజులకు పైగా జరిగే టోర్నీలో ప్రతీ జట్టు 14 మ్యాచ్‌లు ఆడనుంది. అలానే కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఐపీఎల్‌ ఆరంభ వేడుకలు జరగలేదు. దీంతో ఈ సారి సీజన్‌ ప్రారంభోత్సవాన్ని అదిరేలా నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తులు పూర్తి చేసింది. ఇందులో భాగంగానే ప్రముఖ నటీమణులు రష్మిక మంధాన, తమన్నా భాటియా నృత్యాలతో అలరించబోతున్నారు. స్టార్‌ గాయకుడు అర్జిత్‌ సింగ్‌ తన గాత్రంతో ప్రేక్షకులను మైమరిపించనున్నాడు. ఇంకా ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను బీసీసీఐ నిర్వహించనుంది. ఈ వేడుకలు సాయంత్రం 6 గంటలకు నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభవుతాయి.

 

5 వ టైటిల్ కోసం చెన్నై కి అండగా ధోనీ.. సక్సెస్ కంటిన్యూ చేయాలని గుజరాత్ (IPL 2023) 

ఈ 16వ సీజన్ లో తొలి పోరులో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతుంది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది.  గతేడాదే లీగ్‌లో అడుగుపెట్టి.. సంచలన ప్రదర్శనతో విజేతగా నిలిచిన గుజరాత్‌ అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా కనిపిస్తోంది. ఐపీఎల్‌లో తొలిసారే కెప్టెన్‌గా గుజరాత్‌కు టైటిల్‌ అందించిన హార్దిక్‌ పాండ్య ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. బ్యాట్‌తో, బంతితో సత్తాచాటుతున్నాడు. ఈ ఏడాది పరుగుల వరద పారిస్తున్న శుభ్‌మన్‌ గిల్‌.. ఐపీఎల్‌లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. జాతీయ జట్టు కోసం తొలి రెండు మ్యాచ్‌లకు మిల్లర్‌ దూరం కావడం గుజరాత్‌కు దెబ్బే. వేలంలో దక్కించుకున్న కేన్‌ విలియమ్సన్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది ఆసక్తికరం. ఆంధ్ర ఆటగాడు కేఎస్‌ భరత్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. రషీద్‌ ఖాన్‌, మహమ్మద్‌ షమి బౌలింగ్‌లో కీలకం కానున్నారు.

మరోవైపు కేవలం చెన్నై సూపర్ కింగ్స్ గురించి చెపాల్సిన అవసరమే లేదు. ఐపీఎల్‌ మాత్రమే ఆడుతున్న ధోని మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. అతని సారథ్యంలోని చెన్నై ఎప్పటిలాగే బలంగా ఉంది. స్టోక్స్‌, డెవాన్‌ కాన్వె, రుతురాజ్‌, అంబటి రాయుడు, మొయిన్‌ అలీ, జడేజా, తీక్షణ, దీపక్‌ చాహర్‌ లాంటి ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ ఆ జట్టుకు కీలకం కానున్నాడు. ప్రాక్టీస్‌ సందర్భంగా ధోని మోకాలికి గాయమైంది. తొలి మ్యాచ్‌కు అతడు దూరమయ్యే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.

ఇక టోర్నీకి చాలామంది స్టార్‌ ప్లేయర్లు దూరమైతే.. ఇంకొందరు దూరంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పంత్‌, అయ్యర్‌, బుమ్రా వంటి స్టార్లు గాయాలతో ఐపీఎల్‌ ఆడే పరిస్థితి లేదు. ఇక స్టార్‌ ప్లేయర్లైన రోహిత్‌ శర్మ, కోహ్లీ, షమీ ఈసారి కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడాలని డిసైడ్‌ అయ్యారు. దీంతో కీలక మ్యాచ్‌లలోనే వీరు అందుబాటులోకి రానున్నారు.

Exit mobile version