GT vs MI : ఐపీఎల్ 2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండ్ షో తో గుజరాత్ టైటాన్స్ ముంబైని చిత్తుచేసి 55 పరుగుల భారీ తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల నష్టానికి 152 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాట్స్ మెన్ లలో కెప్టెన్ రోహిత్ శర్మ (2) పరుగులకే పెవిలియన్ బాట పట్టగా.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (13) కూడా తక్కువ స్కోర్ కే వికెట్ చేజార్చుకున్నాడు. ఇక ఆ తర్వాత తిలక్ వర్మ (2) కూడా సింగిల్ డిజిట్ స్కోర్ కి పెవిలియన్ కిక్ చేరాడు. కామెరూన్ గ్రీన్ (33; 26 బంతుల్లో 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్(23; 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) పర్వాలేదనిపించగా.. వారు కూడా ఔట్ తర్వాత ఔట్ అయ్యారు.
దీంతో ముంబై ఇండియన్స్‌కి 13 ఓవర్లు ముగిసే సమయానికి 90/6 కి చేరుకోవడంతో అంతా ఓటమి ఖాయమైపోయింది అని అనుకున్నారు. కానీ ఈ దశలో నేహాల్ వధీర (40: 21 బంతుల్లో 3×4, 3×6), పీయూస్ చావ్లా (18: 12 బంతుల్లో 1×4, 1×6) కాసేపు క్రీజులో నిలిచి ముంబై ని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. చివర్లో అర్జున్ టెండూల్కర్ (13: 9 బంతుల్లో 1×6) కూడా ఓ సిక్స్ కొట్టి అభిమానుల్ని అలరించాడు. దీంతో ముంబైకి ఓటమి తప్పలేదు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. కెప్టెన్ హార్దిక్ పాండ్య ఓ వికెట్ పడగొట్టాడు. మొత్తానికి ఈ సీజన్‌లో ఏడో మ్యాచ్ ఆడిన గుజరాత్‌కి ఇది ఐదో విజయం కాగా.. ముంబయికి ఇది నాలుగో ఓటమి అని తెలుస్తుంది.
Yeh dosti… hum nahin todenge! 💙💙 #AavaDe | #GTvMI | #TATAIPL 2023 pic.twitter.com/pRgNbvCgga
— Gujarat Titans (@gujarat_titans) April 25, 2023
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టీం లో.. శుభ్‌మన్ గిల్(56; 34 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. డేవిడ్ మిల్లర్(46; 22 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు), అభినవ్ మనోహర్ (42; 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. విజయ్ శంకర్ (19 ; 16 బంతుల్లో 1 ఫోర్. 1 సిక్స్ ) ఆఖర్లో తెవాటియా (20 నాటౌట్; 5 బంతుల్లో 3 సిక్సర్లు) బ్యాట్ కి పని చెప్పడంతో ముంబై ముందు గుజరాత్ భారీ లక్ష్యం ఉంచగలిగింది. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా, అర్జున్ టెండూల్కర్, రిలే మెరెడిత్, జాసన్ బెహ్రెండోర్ఫ్, కుమార్ కార్తికేయలు ఒక్కొ వికెట్ పడగొట్టాడు. ఈ విజయంతో గుజరాత్ పాయింట్స్ టేబుల్ లో 2 వ స్థానంలో ఉంది.