Site icon Prime9

ICC Awards: “ప్లేయర్ ఆఫ్ ది మంత్”గా విరాట్ కొహ్లీ.. ఐసీసీ అవార్డ్

Kohli nominated icc player of the month award

Kohli nominated icc player of the month award

ICC Awards: అన్ని ఫార్మాట్ల‌లో ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన ఆట‌గాళ్ల‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2021 నుంచి ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్’ అవార్డుతో సత్కరించడం మొద‌లుపెట్టింది. కాగా ఈ ఏడాది అక్టోబర్ నెల గానూ పురుషుల, మహిళల విభాగాల్లో నామినీల వివరాలను తాజాగా ఐసీసీ ప్రకటించింది. మరి టీమిండియా నుంచి ఈ గుర్తింపును ఏ ఆటగాడు పొందుతున్నాడో ఓ సారి చూసేద్దాం.

టీ20 ప్రపంచకప్‌ 2022 టోర్నీలో అక్టోబరు నెలలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, డేవిడ్ మిల్లర్, సికందర్ రజాలు ఈసారి ఈ అవార్డు పోటీలో ఉన్నారు. విరాట్ కోహ్లీ విజృంభించి ఆడుతుండడం గమనిస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు ప్రపంచకప్‌ టోర్నీలో 4 మ్యాచులు ఆడిన కోహ్లీ మూడు హాఫ్ సెంచరీలతో చెలరేగి 220 రన్స్ చేశాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు ఊహించని విజయాన్ని అందించిన కొహ్లీ ఆ తర్వాత నెదర్లాండ్స్‌పై (62 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇలా మొత్తంగా అక్టోబరులో జరిగిన టీ20ల్లో కోహ్లీ 150.73 స్ట్రైక్ రేట్ తో 205 పరుగులు చేశాడు. అయితే ఇందులో విశేషం ఏంటంటే ఇప్పటి వరకూ ఐసీసీ ఇచ్చిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు కోహ్లీ నామినేట్ కావ‌డం ఇదే మొద‌టిసారి. ఇటీవలి కాలంలో మంచి ఫామ్‌లో ఉన్న డేవిడ్ మిల్లర్.. అక్టోబరు నెలలో రెచ్చిపోయాడు. భారత్‌లో జరిగిన టీ20 సిరీస్ మ్యాచ్‌లో 47 బంతుల్లోనే 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. అక్టోబరులో మిల్లర్ 146.37 స్ట్రైక్ రేటుతో 303 పరుగులు చేశాడు. జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా సైతం ఆల్ రౌండ్ ప్రదర్శనను కనపరిచాడు.

ఇకపోతే అక్టోబ‌ర్ నెల‌కు ఐసీసీ విమెన్స్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం భార‌త మ‌హిళల క్రికెట్ టీం నుంచి జెమీమీ రోడ్రిజ్‌, దీప్తి శ‌ర్మ‌ నామినేట్ కాగా పాకిస్తాన్ జ‌ట్టు నుంచి నిడా దార్ నామినేట్ అయ్యారు. ఐసీసీ ఇస్తున్న ఈ అవార్డుని ఇప్ప‌టివ‌ర‌కు టీమిండియా నుంచి రిషబ్ పంత్, ఆర్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, శ్రేయాస్ అయ్యర్ గెలిచుకున్నారు.

ఇదీ చదవండి: భారత్‌ను ఓడిస్తే జింబాబ్వే వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను.. పాకిస్థానీ నటి సెహర్ షిన్వారీ

Exit mobile version