PAK vs ING: ప్రపంచ క్రికెట్లో పాక్ బ్యాటర్లు సరికొత్త రికార్డు నెలకొల్పారు. పాకిస్థాన్ వేదికగా ఇంగ్లాండ్ 7 టీ20 మ్యాచ్లను ఆడనుంది. కాగా తొలి మ్యాచ్ లో పాక్ జట్టును మట్టికరిపించిన ఇంగ్లాండ్.. రెండో మ్యాచ్ లో మాత్రం డీలాపడింది. ఫలితంగా 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. మొదటి మ్యాచ్ ఓటమికి రెండో మ్యాచ్ తో పాక్ ప్రతీకారం తీర్చుకుంది. ఈ గెలుపుతో గతంలో తమ పేరిటే ఉన్న రికార్డును తాజాగా బాబర్-రిజ్వాన్ ల జోడీ తిరగరాసింది.
పాకిస్థాన్.. ఇటీవలె జరిగిన ఆసియా కప్-2022 సీజన్ రన్నరప్ గా నిలించి. అదీ కాక ఈ మధ్య కాలంలో తన అద్భుతమైన ఆట తీరుతో ప్రత్యర్థి జట్లకు సవాల్ విసురుతూ మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తూ సూపర్ ఫాంలో ఉంది. తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ లో ఓటమి పాలైనప్పటికీ.. రెండో మ్యాచ్ లో పుంజుకుని దుమ్మురేపింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ మంచి ఆరంభమే ఇచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. అనంతరం 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ ఓపెనర్లు బాబర్ అజామ్ 66 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్ లతో 110 రన్స్ చేయగా.. మరో ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ 51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 88 పరుగులు చేశాడు.
ఇదీ చదవండి: IND vs AUS T20: నేడు రెండో మ్యాచ్… భారతజట్టుకు గెలుపే కీలకం..!