Asia Cup 2023: ఆసియా కప్ షెడ్యూల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ క్లారిటీ ఇచ్చింది. ఈ వారంలోనే ఆసియా కప్ షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్టు వెల్లడించింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ టోర్నీకి సంబంధించిన మ్యాచ్‌లు జరగనున్నాయని పేర్కొనింది. జూలై 15న దుబాయ్‌లో ఆసియా క్రికెట్ కౌన్సిల్, పీసీబీ అధికారుల మధ్య జరిగిన సమావేశంలో ఆసియా కప్ షెడ్యూల్ పై తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
మొదటి మ్యాచ్ ఎక్కడంటే(Asia Cup 2023)
అంతేకాకుండా టోర్నీ నిర్వహణ, మార్కెటింగ్, క్యాంపెయిన్ వంటి అంశాల గురించి కూడా చర్చించినట్లు పీసీబీ వెల్లడించింది. అయితే ఈ టోర్నీకి సంబంధించి ఫస్ట్ మ్యాచ్‌ను పాకిస్తాన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే పాక్ ఆతిథ్యమివ్వనున్న ఈ ఆసియా కప్ మ్యాచుల్లో టీమిండియా ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ లో పర్యటించే అవకాశం లేదని గతంలోనే బీసీసీఐ వెల్లడించింది. దీనితో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడ్ లో నిర్వహించనున్నారు. దీని ప్రకారం పాకిస్తాన్ నాలుగు మ్యాచ్‌లకు, శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. టీమ్ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్‌లు ఆసియా కప్ 2023 కోసం పోటీపడనున్నాయి.
ఈ ఏడాది భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో ఆసియా కప్‌ను అన్ని జట్లు సన్నాహక మ్యాచులుగా ఉపయోగించుకోనున్నారు. దీనితో ఆసియా కప్ టోర్నీని ఈ సారి వన్డే ఫార్మాట్‌లోనే నిర్వహించనున్నారు. ఇక ఈ టోర్నీలో టీమ్ఇండియా, పాకిస్తాన్, నేపాలు ఒక గ్రూప్‌లో ఉండగా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్గానిస్తాన్‌లు మరో గ్రూపులో ఉన్నాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2 జట్లు సూపర్ 4 దశకు అర్హత సాధించి ఫైనల్ మ్యాచ్ కు రెండు జట్లు చేరతాయి. ఇకపోతే గతంలో టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌లో శ్రీలంక విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.