Chetan Sharma: భారత క్రికెట్ లో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపుతున్నాయి. ప్రపంచ కప్ లో ఇండియా స్థాయిని తగ్గించేలా ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. చేతన్ శర్మపై ఓ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత ఆటగాళ్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడిన ఆడియో బయటకు రావడంతో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి.
ఫిట్‌నెస్ కోసం ఇంజెక్షన్లు తీసుకుంటారు (Chetan Sharma)
భారత క్రికెట్ నియంత్రణ మండలి చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. విరాట్ కోహ్లితో పాటు.. ఇతర ఆటగాళ్ల గురించి ప్రైవేటు సంభాషణలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. చేతన్ శర్మపై.. ఓ ప్రముఖ మీడియా సంస్థ స్టింగ్ ఆపరేషన్ చేపట్టింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మతో పాటు ఇతర టీమిండియా ఆటగాళ్ల గురించి పలు వ్యాఖ్యలు చేశారు చేతన్ శర్మ. ఫిట్ గా లేని ఆటగాళ్లు.. ఇంజెక్షన్లు తీసుకుంటారని వ్యాఖ్యనించాడు. పూర్తి ఫిట్‌గా లేని కొందరు భారత ఆటగాళ్లు ఫిట్ నెస్ కోసం.. ఇంజెక్షన్లు తీసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్సీ విషయంలో విరాట్ కోహ్లి అబద్ధం చెప్పాడని విమర్శించాడు. భారత క్రికెటర్లు 80 శాతం ఫిట్‌గా ఉన్నా సరే.. ఇంజెక్షన్లతో 100 శాతం ఫిట్‌నెస్ సాధిస్తారు. డోప్ టెస్టుల్లో పట్టుబడని ఉత్ప్రేరకాలను ఉపయోగిస్తారని సంభాషించాడు. బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించకముందే ఈ ఇంజెక్షన్ల సాయంతో మ్యాచ్‌లు ఆడినట్లు చేతన్ శర్మ తెలిపాడు.
విరాట్ కోహ్లి హర్ట్ అయ్యాడు..
భారత జట్టులో రెండు వర్గాలు ఉన్నాయని.. ఓ వర్గాన్ని రోహిత్ నడిపిస్తే మరొది కోహ్లీ నేతృత్వంలో నడుస్తుందని అన్నారు. కోహ్లీ, రోహిత్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. కోహ్లీ ఫామ్ కోల్పోయినపుడు రోహిత్ అండగా నిలిచాడు. కోహ్లీ, రోహిత్, మధ్య అహం సమస్యగా మారింది. రోహిత్, హార్దిక్ నన్ను గుడ్డిగా నమ్ముతారని… ఆ ఇద్దరూ మా ఇంటికి వచ్చారు. హార్దిక్ తరచుగా నన్ను కలుస్తాడని చెప్పాడు. కెప్టెన్సీ విషయంలో ప్రయోగాలు చేయాలనుకున్నాం. అందుకే చాలామంది కెప్టెన్లను మార్చి చూశాం. కోహ్లీ కెప్టెన్‌గా ఉంటే.. అతడే మూడు ఫార్మాట్లలో సారథిగా కొనసాగుతాడని మాకు చెప్పారు. కోహ్లీని కెప్టెన్ గా తప్పించాలన్నది గంగూలీ నిర్ణయం కాదు. అది సెలెక్టర్లు ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం. టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్నపుడు.. మరోసారి ఆలోచించుకోవాలని గంగూలీ చెప్పాడు. గంగూలీ తనను కొనసాగమని చెప్పలేదని కోహ్లీ అబద్ధం చెప్పాడు. కెప్టెన్సీ నుంచి తప్పించడంతో కోహ్లీ గంగూలీని విలేకరుల సమావేశంలో నిందించాడు. తనపై వేటు పడటానికి గంగూలీనే కారణమని కోహ్లీ భావించాడు. తాను బీసీసీఐ కంటే ఎక్కువ అని విరాట్ భావించేవాడు. రవిశాస్త్రి కోచ్ కావడంలో కోహ్లిది ముఖ్య పాత్ర అని తెలిపాడు.
యువ ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..
చేతన్ శర్మ యువ ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇవ్వడం కోసమే కోహ్లీ, రోహిత్ కు విశ్రాంతినిచ్చాం. భవిష్యత్తులో రోహిత్ శర్మ టీ20 అవకాశం తక్కువ. హార్దిక్ పాండ్యానే ఎక్కువ కాలం కెప్టెన్‌గా కొనసాగుతాడు. సూర్యకుమార్, దీపక్ హుడా, శుభ్‌మన్ గిల్ ఇషాన్‌కిషన్ లాంటి యువ ఆటగాళ్లను నేనే జట్టులోకి తెచ్చాను. ఇషాన్ కిషన్, శుభ్‌మన్‌ల చక్కటి ఫామ్ సంజు శాంసన్, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్‌ల భవితవ్యాన్ని ప్రమాదంలో పడేసింది అని చేతన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
గత టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వైఫల్యంతో కమిటీలోని మిగతా సభ్యులందరినీ తప్పించింది. కానీ చేతన్‌ను మాత్రం బీసీసీఐ కొనసాగించడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు చేతన్ ప్రైవేటు సంభాషణలో భారత ఆటగాళ్లపై చేసిన వ్యాఖ్యలు.. ఆరోపణలు భారత క్రికెట్‌ను కుదిపేసేలా కనిపిస్తున్నాయి.