Srikakulam : అది శ్రీకాకుళం జిల్లాలోని కనుగులవలస గ్రామం. ఆముదాలవలస మండలంలో ఉన్న ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. జిల్లాలో కనుగులవలస పేరు చెబితే వెంటనే గుర్తుకు వచ్చేది డాక్టర్లే… డాక్టర్లు అంటే ఆర్.ఎం.పి నో లేక పి.ఎం.పి నో అనుకుంటే పొరపాటే.. అక్కడ అందరూ ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్లు అయిన వారే ఉంటారు. శ్రీకాకుళం రిమ్స్ నుంచి హైదరాబాద్ ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల వరకూ ఏ ప్రధాన ఆసుపత్రిలోనైనా ఈ ఊరు డాక్టరు ఒక్కరైనా ఉంటారు. కనుగులవలసలో విద్యకు ప్రధమ ప్రాధాన్యం ఇస్తారు. దానిలోనూ వైద్య విద్యంటే మరీ మక్కువ.. తాము కష్టబడినట్టు తమ బిడ్డలనూ కష్టబెట్టకూడదనుకునే మనస్తత్వం ఇక్కడి తల్లిదండ్రులది.
వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా జీవించే ఇక్కడి ప్రజలు, తమ బిడ్డలను మాత్రం ఉన్నత చదువులు చదివించాలనే సంకల్పం కలిగి ఉంటారు. ఈ ఊరు నుంచి 88 మంది ప్రఖ్యాతి గాంచిన వైద్యులు ఉన్నారంటే , గ్రామంలో వైద్య విద్యకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అర్ధం చేసుకోవచ్చు. 1970 లో మొదట చందర్ రావు, భాస్కర్ రావు అనే ఇద్దరు ఈ గ్రామంలో ఎంబీబీఎస్ చదువుకున్నారు.. ఈ ఇద్దరు వైద్యులే ఆ గ్రామ యువతకు ఆదర్శమయ్యారు. వారిలాగే ఉన్నత చదువులు చదువుకుని వైద్య వృత్తిలో స్ధిరపడాలనే ఆకాంక్ష ఆ ఊరి యువతలో బలంగా నాటుకుపోయింది.
అప్పటి నుంచీ ఆ గ్రామం డాక్టర్ల గ్రామంగా మారింది. శ్రీకాకుళం పట్టణంలో ఉన్న ప్రధాన ఆసుపత్రులన్నింటిలోనూ ఆ ఊరి డాక్టర్లే కనిపిస్తారు. సుమారు 25 మంది వరకూ జిల్లా కేంద్రంలోనే వైద్య సేవలు అందిస్తున్నారు..న్యూరో ఫిజీషియన్లు, గైనకాలజిస్ట్ లు, ఈఎన్‌టీ నిపుణులు, డెంటిస్ట్ లు, బోన్స్ స్పెషలిస్ట్ లు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల జబ్బులుకూ ఆ ఊరులో డాక్టర్లు ఉన్నట్టే. శ్రీకాకుళం నుంచి అమెరికా వరకూ ఆ ఊరి వైద్యులు వృత్తి కలాపాలు నిర్వహిస్తున్నారు. ఇంతమంది డాక్టర్లు తమ గ్రామం నుంచి ఉండటం గర్వకారణమంటారు గ్రామస్తులు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలనే పట్టుదల ఇక్కడి తల్లిదండ్రులకు ఎక్కువ అంటున్నారు స్ధానిక నాయకుడు బొడ్డేపల్లి నారాయణరావు.
88 మంది డాక్టర్లున్న ఈ గ్రామంలో అందరూ ఒక్కసారి కలుసుకున్నప్పుడే నిజమైన పండగంటారు. ఈ గ్రామం పొలిమేర్లలో ఓ డాక్టర్ గారి విగ్రహం దర్శనమిస్తుంది. 2014 లో రాజమండ్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువ డాక్టర్ బెండి సతీష్ ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు గుర్తుగా ఆ గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేసారు. యేడాదిలో రెండు సార్లు ఆ గ్రామానికి చెందిన డాక్టర్లు సొంతూరులో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు. ఒకరు నుంచి ఒకరు…. వారి నుంచి మరి కొందరు అన్నట్టు స్పూర్తి పొంది వైద్య వృత్తిలో స్ధిరపడ్డామంటున్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ బొడ్డేపల్లి సూర్యారావు గ్రామంలో నూటికి 80 శాతం మంది డాక్టర్లు.. మిగతా వారు ఇంజనీరింగ్లో స్ధిరపడ్డవారే.. మొత్తానికి సిక్కోలు జిల్లాలోని కనుగులవలస గ్రామం వైద్యో నారాయణో హరి అన్న నామాన్ని నిత్యం జపిస్తూనే ఉంటుందంటున్నారు గ్రామస్తులు.