Site icon Prime9

YSRCP: చీరాల వైసీపీలో ట్రయాంగిల్ ఫైట్

chirala

chirala

Chirala: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆ నియోజకవర్గం అధికార వైసీసీకి తల నొప్పిగా మారిందట. ముగ్గురు నేతలు సై అంటే సై అంటున్నారట. వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్‌ అంటే తమకే అంటూ ముగ్గురు నేతలూ వారికి వాళ్లే ప్రకటించుకుంటున్నారట. దీంతో వైసీపీ హైకమాండ్‌ ఎవరికి టికెట్‌ ఇవ్వనుంది. మరెవరికి షాక్‌ ఇవ్వనుంది అన్నదాని పై జోరుగా చర్చ సాగుతోందట.

చీరాలలో ముగ్గురు నేతల మధ్య రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం. అధికార వైసీపీకి జైకొట్టారు. బలరాం కుమారుడు వెంకటేష్‌ కూడా సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకొన్నారు. గత ఎన్నికల్లో ఓడి, మొన్నటివరకు నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో తండ్రీ కొడుకులు ఢీ అంటే ఢీ అనే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం చీరాల వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు కరణం వెంకటేష్‌, గడప గడపకు మన ప్రభుత్వంతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయన హాజరవుతున్నారు. నిన్న మొన్నటి వరకు కరణం శిబిరంతో కలిసి నడిచిన ఎమ్మెల్సీ పోతుల సునీత కొత్త దారి వెతుక్కోవడంతో చీరాల రాజకీయం మూడు ముక్కలాటగా మారిపోయింది. పోతుల సునీత వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక చీరాలలో దూకుడు పెంచారు. ఇంకోవైపు, ఆమంచి కృష్ణమోహన్‌ను అనూహ్య పరిణామాల మధ్య పర్చూరు వైసీపీ ఇంఛార్జ్‌గా ప్రకటించారు. కానీ, ఆమంచి పర్చూరు వెళ్లనని, ఇష్టంలేదని సున్నితంగా తిరస్కరించారు. ఆమంచి కూడ చీరాలలోనే తిష్ట వేయడంతో వైసీపీ రాజకీయం రసకందాయంలో పడింది.

ఇక ముగ్గురు నేతల మధ్య సమన్వయం లేక కార్యకర్తలు సైతం వర్గాలుగా విడిపోతున్న పరిస్థితి చీరాల వైసీపీలో కనపడుతోందట. ఆ ప్రభావం చీరాలలో నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కనిపిస్తోందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ నేతలతో కలిసి పోతుల సునీత గడప గడపకు తిరిగేశారు. ఇందులోనూ గ్రూపుల గోల పెరగడంతో పార్టీ అధిష్టానం ఆదేశాలతో ఇంఛార్జ్‌ వెంకటేష్‌ మినహా మిగతావాళ్లు చేపట్టిన కార్యక్రమాలు ఆపక తప్పలేదు. మాజీ ఎమ్మెల్యే పాలేటి రామారావు, మున్సిపల్‌ ఛైర్మన్‌ జంజనం శ్రీనివాసరావుతో కలిసి గడప గడపకు వెళ్తున్నారు ఇంఛార్జ్‌ కరణం వెంకటేష్‌. సచివాలయాల సందర్శన పేరుతో ఎమ్మెల్యే బలరాం కూడా ఫీల్డ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, అధిష్ఠానం ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ మౌనంగా ఉన్నప్పటికి, ఆయన అనుచరుల కదలికలు సందేహాస్పదంగా ఉన్నాయని తెలుస్తోంది. పార్టీలోనే ఇంకెవరికో పరోక్షంగా మద్దతు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో పదే పదే చీరాల వైసీపీలో అనిశ్చితి బయట పడుతోంది. ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్న ఆమంచి గ్రూప్‌ యాక్టివ్‌ అయితే వైసీపీ అధిష్ఠానానికి మరిన్ని తలనొప్పులు తప్పదనే చర్చ నడుస్తోంది. అందుకే ఇక్కడి పరిణామాలను ఎప్పటికప్పుడు పార్టీ పెద్దలు ఆరా తీస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా చీరాలను వైసీపీ ఖాతాలో వేయాలనే పట్టుదలతో అధిష్ఠానం ఉండటంతో రానున్న రోజుల్లో కీలక నిర్ణయమే వెలువడుతుందని అనుకుంటున్నారు.

మొత్తానికి చీరాల వైసీపీలో బలమైన నాయకులు ఉన్నప్పటికీ కలిసి ముందుకుసాగే పరిస్థితి లేదని సమాచారం. ఇక్కడ వైసీపీ గెలవలంటే వర్గ రాజకీయాలకు త్వరలోనే చెక్‌ పెట్టాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కరణం, ఆమంచి, పోతుల, ముగ్గురూ చీరాల టికెట్ ఆశిస్తుండటంతో వైసీపీ రాజకీయం ఆసక్తికరంగా మారింది. మరి, హైకమాండ్‌ ఎవర్ని పక్కనపెడుతుందో, ఎవరికి ఆవకాశం కల్పిస్తుందన్నది చీరాలలో చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version
Skip to toolbar