Akkineni Nagajuna : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకం ప్రస్తుతం విమర్శలకు దారి తీస్తుంది. రైతుల సంక్షేమం, రైతులకు ఆర్ధికంగా ఆసరా కల్పించాలనే ఆశయంతో మొదలు పెట్టిన రైతు బంధు పథకం కేసీఆర్ సర్కారును ఇరుకున పెడుతుంది. చిన్న రైతులకు, ఆర్ధిక ఇబ్బందులు ఉన్నవారికి లబ్ది చేకూరిస్తే బాగుంటుంది కానీ భూస్వాములు, పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులకు, సినీ ప్రముఖులకు కూడా లక్షల్లో సాయం అందుతుండడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రైతు బంధు పథకం కింద హీరో మహేష్ బాబుకు చెక్కులు అందాయి.
మహేష్ కు మహేశ్వరం మండలం లోని నాగారం పరిధిలో 39.2 గుంటల భూమి ఉంది. ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ కు 1.20 ఎకరాల భూమి ఉంది. రైతు బంధు పథకం కింద వారికి రూ. 16 వేల రూపాయలు చెక్కు రూపంలో అందాయి. అయితే ఇప్పుడు తాజాగా హీరో నాగార్జునకు కూడా ఈ పథకం కింద డబ్బులు జమ అయ్యాయన్న వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్టార్ హీరోగా, స్టూడియోలు, పలు బిజినెస్ లు ఉన్న నాగార్జునకు రైతు బంధు పథకం క్రింద డబ్బులు రావడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ పథకంలలో భాగంగా భూమి ఎవరి పేరు మీద ఉంటే వారికి మాత్రమే డబ్బులు వస్తున్నాయని… ఆ భూమిని కౌలుకు చేస్తున్న రైతుకు మాత్రం రూపాయి దక్కడం లేదని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలానే పలువురు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు రైతు బంధు డబ్బును పొందుతున్నారని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.