Munugode: ఈ ఏడాది చివరిలో జరగనున్న మునుగోడు శాసనసభ ఉప ఎన్నిక నేపధ్యంలో ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఒక పార్టీ మీద ఒకరు ఆరోపణలు గుప్పిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు నానా తంటాలు పడుతున్నారు. జరగనున్న ఎన్నికలు అధికార పార్టీ టీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకంగా మారడం, 2023 ఎన్నికల్లో కీలక పట్టు సాధించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఇలా యెత్తుకు పై యెత్తులు వేసుకుంటూ మునుగోడులో ఎన్నికల వేడిని రాజేసారు.
తాజాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు రాజీనామా చేస్తూ భాజాపా లో చేరి అధికార పార్టీకి జలక్ ఇచ్చారు. నల్గొండ జిల్లా నేతలతో ముఖ్య మంత్రి కేసిఆర్ ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించిన రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడంతో నివ్వెరపోవడం అధికార పార్టీ వంతైంది. టీఆర్ఎస్ పార్టీని వీడిన వారిలో చండూరు జెడ్పీటీసి సభ్యులు కర్నాటి వెంకటేశం, గట్టుప్పల్ ఎంపీటీసి గీత శ్రీనివాస్, ఉడుతల పల్లి ఉప సర్పంచ్ తులసయ్యలు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో భాజాపాలో చేరిన్నట్లు ప్రకటించారు. వీరితో పాటు వందలాది మంది టిఆర్ఎస్ కార్యకర్తలు కూడా భాజాపా లోకి చేరడం పట్ల అధికార పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది.
మునుగోడు ఉప ఎన్నికల బరిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భాజాపా అభ్యర్ధిగా, పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇప్పటికే ప్రచారం చేసుకొంటున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ అభ్యర్ధి పేరును ఖరారు చేయకపోవడంతో స్థానిక మునుగోడు కీలక నేతలే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర రెడ్డిని టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆత్మీయ సమ్మేళనలు పేరుతో మునుగోడు నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి ఓటర్లను ఆకర్షించేందుకు టీఆర్ఎస్ తగిన ప్రణాళికలతో సిద్ధం చేసిన్నట్లు సమాచారం.