Congress Jana Garjana Sabha: కొద్దినెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపుతురుగుతున్నాయి. కేంద్రం తెలంగాణపై దృష్టి సారించి ఈ సారి ఎలాగైనా తెలంగాణలో కాషాషజెండా ఎగురవెయ్యాలని భావిస్తోంది. ఈ తరుణంలోనే భాజపాపై కేంద్ర ప్రభుత్వపు పోకడలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతీయస్థాయిలో తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే పూర్వవైభవం తీసుకువచ్చేలా హస్తం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీనితో తెలంగాణ రాజకీయాలు ఫుల్ కాకరేపుతున్నాయి. ఓ వైపు అధికారపార్టీ బీఆర్ఎస్.. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ తెలంగాణలో దుకూడు పెంచాయి.
ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఎన్నికల నగారా( Congress Jana Garjana Sabha)
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం వేదికగా ఎన్నికల శంఖారావం పూరించనుంది. ఇవాళ ఖమ్మం పట్టణంలోని ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో తెలంగాణ జనగర్జన సభ జరగనుంది. ఓ వైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు అధికారికంగా వారే వెల్లడించారు. వీరితో పాటు మరికొందరు నేతలు కూడా నేడు ఖమ్మం సభలో కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఈ రోజే ముగియనున్న నేపథ్యంలో వంద ఎకరాల్లో భారీ బహిరంగ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు కాంగ్రెస్ నాయకులు. దీనికోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ జనగర్జన సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కాగా ఈ సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ తమ మ్యానిఫెస్టోను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ సభలో కేవలం ఆరుగురు నేతలకు మాత్రమే ప్రసంగించే అవకాశం లభించనున్నట్టు సమాచారం. రాహుల్ గాంధీ తోపాటు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేణుకా చౌదరి మాత్రమే ఈ సభలో మాట్లాడుతారట. ఇక ఈ సభ కోసం రాహుల్ ముందుగా విజయవాడ చేరుకోనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఖమ్మం సభకు రానున్నారు.