Perni Nani: ఏపీలో రాజకీయాలు చాలా వేడిమీదున్నాయి. వైసీపీపై తెదేపా, జనసేన పార్టీలు మూకుమ్మడి దాడికి సిద్దమైనట్టు తెలుస్తోంది. దానికి ఏ మాత్రం తీసిపోనట్టు వైసీపీ కూడా ఆ ఇరుపార్టీలపై ప్రతిదాడులకు దిగుతుంది. నేడు మంగళగిరి వేదికగా జరిగిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశం తీరుపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్లు వేశారు. ఏ పార్టీ పీఏసీ మీటింగ్ అయిన జరిగినప్పుడు వారు ప్రజలకు మేలు చేసే పనులపై మాట్లాడటం సహజమని కానీ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందాన ఇవాళ జనసేన తన రాజకీయ వ్యవహరాల కమిటీ సమావేశం జరిపిందంటూ ఎద్దేవా చేశారు. ఒక వారం కింద చేసిన తీర్మానాలనే మరల కాపీ చేసి సమావేశంలోకి తీసుకొచ్చారని విమర్శించారు.
ప్రజలకు వారు ఏం చేస్తారో చెప్పకుండా అరాచకాలు సృష్టించిన వారిని అభినందిస్తూ జనసేన తీర్మానం చేసిందంటూ పేర్నినాని మండిపడ్డారు. ‘మహిళలపై దాడులు చేసే వారికి మద్దతిస్తూ తీర్మానం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా వైజాగ్ లో పవన్ ర్యాలీ నిర్వహించారని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో సానుభూతి పొందడం కోసం జనసేన వైసీపీపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
చంద్రబాబు పవన్‌ను ఎందుకు పరామర్శించారు? మంత్రులపై దాడి చేసినందుకా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు కోసం పవన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మంత్రి ఇంటిపై దాడి చేసిన వారిలో మీ కార్యకర్తలు లేరా? ముద్రగడపై దాడి సమయంలో పవన్ తెదేపాను ఎందుకు ప్రశ్నించలేదు? ’ అని జనసేనపై మాజీ మంత్రి పెర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుని రైల్వే ఘటనను వైసీపీకి ఆపాదిస్తున్నారని, కానీ ఆ ఘటనలో యువకులపై పెట్టిన కేసులను ఎత్తివేసింది వైసీపీ ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు.
ఇదీ చదవండి: పీఏసీలో పలు తీర్మానాలు చేసిన జనసేన.. వైసీపీపై నాదెండ్ల సంచలన కామెంట్స్