Hyderabad: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణా రెడ్డి కలిశారు. మునుగోడు అభ్యర్థిగా పార్టీ అధిష్టానం స్రవంతిని ఎంపిక చేసిన నేపథ్యంలో కలిసి పని చేయాలని వారికి సూచించారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రేవంత్ రెడ్డి వారికి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా చలమల కృష్ణారెడ్డిని రేవంత్ రెడ్డి బుజ్జగించినట్టుగా తెలుస్తోంది. మునుగోడు టికెట్ ఆశించిన పల్లె రవి, కైలాష్ నేతతో కూడా రేవంత్ మాట్లాడనున్నట్టుగా తెలుస్తోంది.
మునుగోడు టికెట్ రావడం అదృష్టంగా భావిస్తున్నట్టుగా పాల్వాయి స్రవంతి చెప్పారు. అసలైన కార్యకర్తలు ఎవరూ పార్టీని వీడటం లేదని అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షలాంటిదని, దీనిని ఒక బాధ్యతగా తీసుకుని ముందుకు సాగుతానని చెప్పారు. మరోవైపు సాయంత్రం గాంధీభవన్ లో కాంగ్రెస్ ముఖ్య నేతలు భేటీ కానున్నారు. ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు ఆధ్వర్యంలో మీటింగ్ జరుగనుంది. మునుగోడు ఉప ఎన్నిక పై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు చలమల కృష్ణారెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పాల్వాయి స్రవంతి వైపే అధిష్టానం మొగ్గు చూపింది.