Site icon Prime9

TRS: వరంగల్ జిల్లాలో ’కారు‘ దిగేస్తున్నారు..

trsparty-warangal

Warangal: అది తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిచ్చిన ఉమ్మడి వరంగల్ జిల్లా. టీఆర్‌ఎస్‌కు మంచి పట్టు ఉన్న జిల్లా. అయితే, ఆ జిల్లా నుంచి పలువురు నాయకులు టీఆర్ఎస్‌ను వీడటం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో అంతర్గత విబేధాలు, స్థానిక నాయకుల పై అసంతృప్తి, కొంతమంది నాయకుల పనితీరు పై అసంతృప్తివాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేస్తూ బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు.

ఇటీవల సీనియర్ నేత కన్నెబోయిన రాజయ్య యాదవ్ టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఎంతో బాధతో టీఆర్ఎస్‌తో 22 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఖమ్మం జైలు జీవితం సహా అనేక విషయాలలో కేసీఆర్ కు తోడుగా ఉన్నట్లు కన్నెబోయిన రాజయ్య యాదవ్ చెప్పారు. పదవులు కాదు. ఆత్మగౌరవం లేకనే పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు. పోరాడి సాధించిన తెలంగాణలో ఉద్యమకారులు లేరని, ఉద్యమకారులను కేసీఆర్ ఆదరించే పరిస్థితి లేదన్నారు. టీఆర్ఎస్‌లో ఉన్నంత కాలం బాధ తప్ప ఇంకేం ఉండదని రాజయ్య అన్నారు. వాపును బలుపు అనుకోవడం మంచి పద్ధతికాదని, అలాంటి అనేక పార్టీలు కంటికి కనిపించకుండా పోయాయన్నారు. కేసీఆర్ పై అనేక విమర్శలు చేసి గులాబీ గూటి నుంచి బయటకి వచ్చి కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు.

కన్నెబోయిన రాజయ్య రాజీనామా ఎపిసోడ్ ముగిసిందో లేదో, కొద్ది రోజులకే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో ఎర్రబెల్లి ప్రదీప్ రావు కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే ఎర్రబెల్లి దయాకరరావు సోదరుడు పార్టీ మారడంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పార్టీ అంతర్గత కలహాలు బయటపడ్డాయి. వరంగల్ తూర్పులో ఎమ్మెల్యే నరేందర్ వర్సెస్ మంత్రి సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నట్లుగా రాజకీయం నడిచింది. ఇక ఇంతకాలం గులాబీ పార్టీలో బాగానే ఉన్న మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి కూడా బీజేపీ గూటికి చేరారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఈ నెల 9వ తేదీన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. సీఎం కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విధివిధానాలు నచ్చక టీఆర్ఎస్‌ను వీడినట్లు ఆయన ప్రకటించారు. అయితే, మొలుగూరి బిక్షపతి రానున్న అసెంబ్లీ ఎన్నికలో పరకాల బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తారా, ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనే చర్చ పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది.

తెలంగాణ ఉద్యమంలో చురుకుగా ఉన్న నాయకులకు సరైన గుర్తింపు లేకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నుండి ఇతర పార్టీలకు భారీగా వలసలు వెళ్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. భవిష్యత్‌లో మరికొంత మంది నేతలు కూడా అదే బాట పట్టవచ్చంటున్నారు. మరి, టీఆర్ఎస్‌ను వీడీ ఇతర పార్టీల వైపు చూస్తున్నా నాయకులను టీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగిస్తుందా, లేదా టీఆర్ఎస్ పార్టీని ఇంకెవరూ విడకుండా చర్యలు చేపడుతుందా వేచి చూడాలి.

Exit mobile version