Mudragada Padmanabham: ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎత్తులు పైఎత్తులు మాటలు తూటాలతో రాజకీయ రణరంగంగా ఏపీ కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ ఏపీ రాజకీయాల్లో కాపులది ముఖ్య పాత్ర అని చెప్పుకోవచ్చు. అసలు ఆంధ్రప్రదేశ్లో కాపులకు రిజర్వేషన్లు కావాలని తమకు తగిన ప్రాధాన్యతను కల్పించాలని కోరుతూ కాపు ఉద్యమానికి నాంది పలికారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. అయితే తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈ లేఖలో కాపు రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు.
ఇటీవల కాపు రిజర్వేషన్లపై కేంద్రం పార్లమెంట్ వేదికగా ఇచ్చిన సమాధానాన్ని ఆయన లేఖలో పేర్కొన్నారు. గతంలో కూడా కాపులు పొగొట్టుకున్న రిజర్వేషన్ విషయమై లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. తిరిగి ఇప్పుడు తాజాగా ఈ లేఖ రాయడానికి సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఈడబ్ల్యూఎస్ పై ఇచ్చిన తీర్పు, రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు అనుసరించి ఆర్టికల్ 342 A (3) ప్రకారం రిజర్వేషన్ రాష్ట్రంలో అమలు చేసుకోవచ్చు కేంద్రం నుంచి వచ్చిన సమాధానమే కారణమంటూ ముద్రగడ గుర్తుచేశారు. రిజర్వేషన్లు రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానం పై సీఎం జగన్ ను దృష్టి పెట్టాలని కోరారు. రిజర్వేషన్లపై ఆలోచన చేయాలని లేఖలో కోరారు ముద్రగడ. అందరూ అనుభవించగా మిగిలిన దానిలో తమకు రిజర్వేషన్లు ఇప్పించాలని ఆయన కోరారు. 2019 ఎన్నికల్లో మెజార్టీ నియోజకవర్గాలలో మీ గెలుపుకు కాపు జాతి కృషి చేసిందని లేఖలో పేర్కొన్నారు. కాపు జాతికి రిజర్వేషన్ కల్పించి మరొకసారి కాపులు మీ విజయానికి ఉపయోగపడేలా చూసుకుంటే బాగుంటుందని ఆనయ గుర్తుచేశారు.
మిగతా కులాలు వారిలాగే కాపు జాతికి వెలుగులు చూపించాలని సీఎం జగన్ ను ముద్రగడ లేఖ ద్వారా కోరారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్‌లను ప్రజలు దేవుళ్ళు లా భావించారని పేద వర్గాలకు మంచి చేసి మీరు కూడా వారిలా ప్రేమించబడడానికి పునాదులు వేసుకోవాలన్నారు. రిజర్వేషన్లు కల్పించుటకు ఆలోచన చేసి పేద కాపులకు న్యాయం చేయాలని సూచించారు. నా జాతి కోసం తపనే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదని లేఖలో పేర్కొన్నారు ముద్రగడ పద్మనాభం. మరి దీనిపై సీఎం జగన్ ఏవిధంగా స్పందించనున్నారు అనేది వేచి చూడాలి.
ఇదీ చదవండి: వెంకయ్య నాయుడు: సీనియర్ ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్.. ఆ ఆరుగురు మహిళలే కారణమంటున్న వెంకయ్య నాయుడు