New Delhi: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అధికార యంత్రాంగం నోటిఫికేషన్ జారీ చేసింది. సుదీర్ఘకాలం పాటు పార్టీ అధినేత్రిగా ఉన్న సోనియాగాంధీ వారసుడిని ఎన్నుకునేందుకు వేదికను సిద్ధం చేసింది. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జరగనున్న పార్టీ అధ్యక్షుడి ఎన్నికను సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ ప్రకటించారు.
ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు జరగనుంది. నామినేషన్ పత్రాల పరిశీలన తేదీ అక్టోబర్ 1న ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 8 ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే అక్టోబర్ 17న ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ అధ్యక్షుడి రేసులో ముందున్నారు. అయితే ఆయన అటు సీఎం పదవిలో ఉంటూ ఇటు పార్టీ అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నారు.
ఈ సంవత్సరం మేలో, పార్టీ ‘చింతన్ శివిర్’ సమయంలో, కాంగ్రెస్ ఉదయపూర్ డిక్లరేషన్‌ను ఆమోదించింది. దీనిప్రకారం “సంస్థాగత సంస్కరణలలో” ఒక వ్యక్తి, ఒకే పదవి మాత్రమే ఉండాలి అని నిర్ణయించారు. ఈ నియమం వర్తింపజేస్తే, అశోక్ గెహ్లాట్ సీఎం పదవిని వదులుకోవలసి ఉంటుంది.