Site icon Prime9

CM KCR: బీజేపీ సర్కారును సాగనంపాల్సిందే.. కేసీఆర్

kcr-patna-visit

Patna: కేంద్రంలోని బీజేపీ సర్కారును సాగనంపాల్సి ఉందని సమయం ఆసన్నమయిందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. సీఎం నీతీష్ కుమార్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. గల్వాన్‌ ఘర్షణల్లో అమరులైన ఐదుగురు బిహార్‌ సైనికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.

8ఏళ్ల మోదీ పాలనలో దేశం పూర్తిగా నష్టపోయిందని ధ్వజమెత్తారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయినా దేశ రాజధాని ఢిల్లీలో తాగునీటి అవసరాలు తీర్చలేకపోతున్నారని విమర్శించారు. ప్రతి విషయంలోనూ చైనాతో పోల్చుకుంటున్న మనం భారత్‌ ఏ రంగంలోనూ ప్రగతి సాధించలేదని అన్నారు. జాతీయ జెండా కూడా చైనాలో తయారై వస్తోందని ఎద్దేవా చేశారు. బేటీ పడావో బేటీబచావో నినాదాలున్నా, కఠిన చట్టాల అమలులో జాప్యం వల్ల దేశంలో మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు.

ఢిల్లీలో రైతులు చేసిన దీక్షకు మోడీ క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలను దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎల్ఐసీని ప్రైవేటీకరణతో పాటు లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్నారని కేసీఆర్ దుయ్యబట్టారు. మోడీ సర్కార్ బీజేపీయేతర విపక్షాలను తీవ్ర ఇబ్బందులు పెడుతోందన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చుతోందని విమర్శించారు. నితీష్ కుమార్ దేశంలో అత్యంత రాజనీతిజ్ఞుడని కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. దేశంలోని విపక్షాలన్నీ ఏకతాటిపై ఉన్నాయని, సమయం వచ్చినపుడు కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనేది చెబుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం విపక్షాలన్నీ కలిసి రావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన పోరాటాన్ని నితీష్ ప్రశంసించారు. ఉద్యమంలో పోరాడిన తీరును కొనియాడారు. గతంలో ఎన్ని పోరాటాలు జరిగినా కేసీఆర్ ఒక్కడే తుదికంటా పోరాడి ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్షను నెరవేర్చారని అన్నారు.

Exit mobile version