Bandi Sanjay: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేటి నుంచి ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిర్మల్ జిల్లా భైంసా నుంచి బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా ఆయన యాత్రకు, సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కాగా యాత్ర కోసం నిన్న రాత్రి భైంసాకు వెళ్తున్న ఆయనను పోలీసులు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ శివారులో అడ్డుకున్నారు. సంజయ్ ను అక్కడి నుంచి కరీంనగర్ లోని తన ఇంటికి తరలించారు. ఇంటి నుంచి బయటకు రావద్దంటూ ఆయనను గృహనిర్బంధం చేశారు.
ఈ నేపథ్యంలో భాజపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేసేందుకు బీజేపీ సన్నద్ధమైంది. హైకోర్టు ఇచ్చే ఆదేశాల మేరకు పాదయాత్రపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు, పాదయాత్రకు అనుమతి నిరాకరణపై సీఎం కేసీఆర్ పై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని విమర్శిస్తున్నాయి.
ఇదీ చదవండి: ఐటీ విచారణకు మంత్రి మల్లారెడ్డి దూరం