Bakrid 2023: తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలను చాలా భక్తిశ్రద్ధలతో ముస్లింలు నిర్వహించారు. త్యాగ నిరతికి, భక్తిభవానికి ప్రతీకగా నిలిచేది బక్రీద్. ఇస్లామిక్ క్యాలెండర్‌లో 12వ నెల అయిన జుల్‌హిజ్జా నెలలో పదో రోజున పండుగ కాగా, తొమ్మిదో రోజునే ఆరాఫా దినంగా జరుపుకుంటారు. రంజాన్ మాసం ముగిశాక రెండు నెలల తర్వాత వచ్చే అత్యంత ముఖ్యమైన పండుగల్లో బక్రీద్ ఒకటి. ఈ సందర్భంగా మసీదులు, దర్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఒకరికొకరు అలయ్ బలయ్ చేసుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. హైదరాబాద్ టోలీచౌక్‌లోని సెవెన్ టూంబ్స్ వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతేకాకుండా ఈ పండుగ సందర్భంగా ధనం, ఆహార పదార్థాలు, వస్తువులను దానం చేయడం అనాదిగా వస్తున్నది.