Prime Minister Modi Comments: ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన మెరుపుదాడిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటికే ఖండించిన విషయం తెలిసిందే. హమాస్ దాడి చేసిందన్న విషయం తెలిసిన కొన్ని గంటల్లోనే ఆయన ట్విటర్ ద్వారా దాడిపై స్పందించారు. ఈ దాడి తనని బాధించిందని, ఈ క్లిష్ట సమయంలో తాము ఇజ్రాయెల్‌కి అండగా ఉంటామని తెలిపారు. ఇందుకు ఇజ్రాయెల్ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు.
ఇజ్రాయెల్ కు మా మద్దతు..(Prime Minister Modi Comments)
నెతన్యాహు మంగళవారం తనకు ఫోన్ చేశారని.. హమాస్‌తో జరుగుతున్న యుద్ధం గురించి తనతో చర్చించారని ప్రధాని మోదీ తెలిపారు. ఇజ్రాయెల్‌కు భారత్ అన్ని విధాలుగా మద్దతు ఇస్తుందని నెతన్యాహుకు తాను హామీ ఇచ్చానన్నారు మోదీ. ఉగ్రవాదాన్ని అన్ని రకాలుగానూ భారత్ తీవ్రంగా ఖండిస్తుందని మోదీ నొక్కి చెప్పారు. తనకు ఫోన్ చేసి, ప్రస్తుతం హమాస్‌తో కొనసాగుతున్న ఘర్షణపై అప్డేట్ అందించినందుకు ప్రధానమంత్రి నెతన్యాహుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో భారతదేశ ప్రజలు ఇజ్రాయెల్‌కి అండగా నిలబడతారు. అన్ని విధాలుగానూ ఇండియా టెర్రరిజాన్ని నిస్సందేహంగా ఖండిస్తుందని ప్రధాని మోదీ సోషల్ ప్లాట్‌ఫాం ఎక్స్ ద్వారా స్పందించారు.
అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు ఇజ్రాయెల్‌కు తమ మద్దతు తెలియజేస్తూ, హమాస్ ఉగ్రవాద చర్యల్ని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో.. ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ నుంచి ఈ ఫోన్ కాల్ వచ్చింది. ఇజ్రాయెల్‌తో పాటు పాలస్తీనాకు భారత్ మిత్రదేశమని.. ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించడంలో సహాయం చేయడానికి తప్పనిసరిగా ముందుకు రావాలని భారత్‌లోని పాలస్తీనా రాయబారి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. మోదీ, నెతన్యాహు మధ్య జరిగిన ఈ సంభాషణకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. పాలస్తీనా విషయంలో భారత్ నుంచి ఎలాంటి స్పందన లేదు. హమాస్ దాడిని వ్యతిరేకిస్తూ.. ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచింది.