kerala Dogs: కేరళలోని కొట్టాయంలో ఒక అనుమానాస్పద మాదకద్రవ్యాల వ్యాపారి ఇంటిపై దాడి చేసిన పోలీసులపై ఒక్కసారిగా పలు కుక్కలు దాడి చేసాయి. ఖాకీ దుస్తులు ధరించిన వారిని కరిచేలా వాటికి ట్రైనింగ్ ఇచ్చారని తెలుసుకున్న పోలీసులు షాక్ తిన్నారు. కుక్కల దాడులనుంచి కాపాడుకోవడంపై పోలీసులు దృష్టి సారించడంతో నిందితులు తప్పించుకోవడానికి వీలు కలిగింది.
డాగ్ ట్రైనర్ ముసుగులో..(kerala Dogs)
కొట్టాయం ఎస్పీ కార్తీక్ చెప్పిన వివరాల ప్రకారం స్దానికంగా ఉంటున్న ఒక వ్యక్తి ఇంట్లో ఆదివారం రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే అక్కడికి చేరుకున్నాక అన్ని కుక్కలు ఉంటాయని ఒకే సారి దాడి చేస్తాయని వారు ఊహించలేదు. మొత్తంమీద కుక్కలను అదుపులోకి తీసుకుని 17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా పోలీసులు ఎవరూ గాయపడలేదు. అయితే నిందితుడి గురించి పలు విషయాలు తెలిసాయి. నిందితుడు ఖాకీ దుస్తుల్లో ఉన్నవారిపై దాడి చేసే విధంగా కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చాడు. దీనికోసం అతను బీఎస్ఎఫ్ లో పనిచేసి రిటైరయిన వ్యక్తి దగ్గర శిక్షణ పొందాడు. అయితే ఖాకీ దుస్తులు ధరించిన వారిని ఎలా కరవాలి వంటి ప్రశ్నలు అడుగుతుండటంతో అతడని గెంటేసినట్లు తెలిసింది. తరువాత అతను డాగ్ ట్రైనర్ గా అవతారమెత్తి డ్రగ్స్ అమ్మడం ప్రారంభించాడు.స్దానికంగా ఒక ఇల్లు అద్దెకు తీసుకుని తాను కుక్కలకు ట్రైనింగ్ ఇస్తానని చెప్పడంతో చుట్టుపక్కల వారందరూ తమ కుక్కలను అతడి వద్ద విడిచిపెట్టే వారు. దీనికోసం అతను రోజుకు రూ.1,000 వసూలు చేసేవాడు. ప్రస్తుతం అక్కడ 13 కుక్కలు ఉన్నాయని, వాటి యజమానులను గుర్తించిన తర్వాత కుక్కలను వారికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. ముందుగా నిందితులను పట్టుకుని ఈ రాకెట్లో ఎవరి ప్రమేయం ఉందో తేల్చాలని పోలీసులు భావిస్తున్నారు.