Rahul Gandhi in Manipur: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన మణిపూర్ పర్యటనలో రెండవరోజు శుక్రవారం మొయిరాంగ్‌కు వెళ్లారు. అక్కడ బాధిత ప్రజలను కలుసుకుని వారి కష్టాలను విన్నారు. మణిపూర్ సమగ్రతపై సమన్వయ కమిటీ , పౌర సమాజ సంస్థ, యునైటెడ్ నాగా కౌన్సిల్ ప్రతినిధులు, మణిపూర్‌లోని నాగా కమ్యూనిటీ అపెక్స్ బాడీ, షెడ్యూల్డ్ తెగల డిమాండ్ కమిటీ మరియు ప్రముఖ వ్యక్తులను కూడా రాహుల్ గాంధీ కలిశారు.
అంతకుముందు జాతి అల్లర్ల కారణంగా ప్రభావితమైన చురాచంద్‌పూర్‌లోని సహాయ శిబిరాలను సందర్శించారు.మణిపూర్ గవర్నర్‌ను కలిసిన అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మణిపూర్‌లో శాంతి నెలకొనాలని అన్నారు. ఇక్కడ శాంతి నెలకొనాలని కోరుకుంటున్నాను. కొన్ని రిలీఫ్ క్యాంపులను సందర్శించానని, ఈ రిలీఫ్ క్యాంపుల్లో లోపాలున్నాయని అన్నారు. ప్రభుత్వం వీటిపై దృష్టి సారించాలన్నారు. మణిపూర్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కైషమ్ మేఘచంద్ర తెలిపిన వివరాల ప్రకారం రాహుల్ గాంధీ ఇంఫాల్‌కు తిరిగి వెళ్లి, భావసారూప్యత కలిగిన 10 మంది పార్టీ నాయకులు, యునైటెడ్ నాగా కౌన్సిల్ (UNC) నాయకులు మరియు పౌర సమాజ సంస్థ సభ్యులతో సమావేశమవుతారు.
గురువారం రాహుల్ గాంధీ ని బిష్ణుపూర్‌లో పోలీసులు అడ్డుకున్నారు. దారి పొడవునా హింసాత్మక ఘటనలు జరుగుతాయనే భయంతో కాన్వాయ్‌ను నిలిపివేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మరోవైపు రాహుల్ గాంధీ పర్యటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ, ఒక రాష్ట్రంలో అస్తవ్యస్త పరిస్దితులు ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించకూడదని అన్నారు. మణిపూర్‌లో శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని శర్మ మీడియాతో అన్నారు. మణిపూర్‌కు ఇతర రాజకీయ వ్యక్తులు వెళ్లవలసిన అవసరం లేదు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్రం మాత్రమే రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించగలవని అన్నారు. ఇతరులు ఒకటి లేదా రెండు రోజుల్లో వెళ్లి తిరిగి వస్తారు. వారి పర్యటనల వల్ల ఎలాంటి పరిష్కారం రాదు. ఇది మీడియా దృష్టిని ఆకర్షించడానికి మాత్రమే ఉపయోగపడుతుందని శర్మ అన్నారు.